Share News

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:16 PM

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులపై జోకులు వేసినందుకు హాస్యనటుడు సమయ్ రైనా, మరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు
SC Quashes FIRs Against Samay Raina, Others in Latent Case

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 14: యూట్యూబ్ కామేడీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent)లో దివ్యాంగులనుద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాతో పాటు మరో నలుగురికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వారిపై నమోదైన అన్ని క్రిమినల్ ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.


సుప్రీంకోర్టు వ్యాఖ్యలు: 'అత్యంత తెలివైన యువకులు'

గతంలో దివ్యాంగుల సంక్షేమం, నిధుల సమీకరణ, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమయ్ రైనా బృందం సమర్థవంతంగా అమలు చేయడాన్ని ధర్మాసనం ప్రశంసించింది.

సానుకూల మార్పు: 'నిజాయతీతో కూడిన ప్రయత్నాలు చేసినప్పుడు కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. వీరంతా అత్యంత తెలివైన యువకులు. వీరు సానుకూల దిశలో పనిచేయడం ప్రారంభిస్తే, ఆ నిష్పత్తిలోనే మంచి ఫలితాలు వస్తాయి' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

కేసు క్లోజ్: సమయ్ రైనాతో పాటు విపుల్ గోయల్, బల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్ (అలియాస్ సోనాలి ఆదిత్య దేశాయ్) నిశాంత్ జగదీష్ తన్వర్‌లపై ఉన్న క్రిమినల్ వ్యవహారాలను పూర్తిగా ముగిస్తున్నట్లు(Quashed) కోర్టు ప్రకటించింది.

వివాదం ఏంటి?

2024 నవంబర్ 14న రికార్డై ఆ తర్వాత ప్రసారమైన 'ఇండియాస్ గాట్ లేటెంట్' ఎపిసోడ్‌లో దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధి(SMA) ఉన్న వారిని ఉద్దేశించి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు(Cure SMA India Foundation) కోర్టును ఆశ్రయించగా, ఈ కమెడియన్లపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ఈ యువ కమెడియన్లు దివ్యాంగుల కోసం నిధుల సమీకరణ కార్యక్రమాలు, చెస్ టోర్నమెంట్లు, చైతన్య సదస్సులు నిర్వహించి నిధులను సేకరించారు.

విస్తృతమైన అంశంపై విచారణ కొనసాగింపు

కమెడియన్లపై ఉన్న కేసులను క్లోజ్ చేసినప్పటికీ, భవిష్యత్తులో డిజిటల్ లేదా ఆన్‌లైన్ కంటెంట్‌లో దివ్యాంగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఎలాంటి నిబంధనలు తీసుకోవాలో పరిశీలించేందుకు ఈ ప్రధాన అంశంపై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Updated Date - Aug 14 , 2026 | 05:37 PM