Share News

‘బొద్దింకల’పై కేసులు ఎత్తివేత

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:17 AM

నీట్‌ లీకేజీ బాధ్యులపై చర్యలు, అప్పటి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ.. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలకు దిగిన ఆందోళనకారులపై...

‘బొద్దింకల’పై కేసులు ఎత్తివేత

  • అన్ని రాష్ట్రాల్లో సీజేపీ ఆందోళనకారులపై ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • ఆర్టికల్‌ 142 కింద అసాధారణ అధికారాలను వినియోగిస్తూ ఉత్తర్వులు

  • తీవ్ర నేర చరిత్ర ఉన్న 2,873 మందిపై మాత్రం కొత్తగా కేసులు

  • సీజేఐ సూర్యకాంత్‌ ధర్మాసనం నిర్ణయం

  • ఢిల్లీలో తలపెట్టిన ఆందోళనలను విరమించుకుంటున్నాం: సీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: నీట్‌ లీకేజీ బాధ్యులపై చర్యలు, అప్పటి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ.. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలకు దిగిన ఆందోళనకారులపై కేసులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. జూలై 20 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆందోళనలకు సంబంధించి దేశవ్యాప్తంగా పోలీ్‌సస్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి మేరకు.. ఆందోళనకారుల్లో తీవ్రమైన నేరచరిత్ర ఉన్న 2,873 మందిపై మాత్రం తాజాగా కేసులు నమోదు చేయడానికి అనుమతించింది. ఇక నీట్‌ లీకేజీతో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. మరోవైపు విద్యార్థులపై కేసుల ఎత్తివేత, ప్రభుత్వ హామీల అమలు డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో తలపెట్టిన ఆందోళనను విరమించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించింది.


కేంద్రం, రాష్ట్రాల అభ్యర్థన మేరకు..

సీజేపీ ఆందోళనల్లో హింసపై దాఖలైన వివిధ పిటిషన్లపై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని, అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, అసోం, బెంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలు ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కోరాయి. ఈ మేరకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి అభ్యర్థనలను సమర్పించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం ఆందోళనకారులపై కేసులను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. ‘‘ఆందోళనలు చేపట్టిన యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. జూలై 20 నుంచి 25 వరకు జరిగిన ఆందోళనలకు సంబంధించి ప్రస్తుతం కోర్టు ముందుకు రాని ఏ కేసులైనా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో నమోదైన కేసులైనా సరే.. వాటన్నింటినీ మూసివేయాలి’’ అని ఆదేశించింది. ధర్మాసనం తీర్పు అనంతరం.. సీజేపీ తరఫున కో-కన్వీనర్‌ సౌరవ్‌దాస్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తాజాగా కోర్టు కల్పించిన న్యాయపరమైన భరోసాను దృష్టిలో ఉంచుకుని శనివారం ఢిల్లీలో తలపెట్టిన ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు సౌరవ్‌దాస్‌ తెలిపారు. కేసుల ఎత్తివేతతో తమ పోరాటం పూర్తిస్థాయిలో విజయవంతమైందని సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే పేర్కొన్నారు. ఇక కేసుల ఎత్తివేత, పరిహారం చెల్లింపు సహా ఇతర హామీలను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తుషార్‌ మెహతా వెల్లడించారు. ఇరువర్గాల హామీలను ధర్మాసనం నమోదు చేసుకుంది. ఈ కేసుల ఎత్తివేత ఆదేశాలు కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చినవని.. కోర్టులు దీనిని ఉదాహరణగా పరిగణించరాదని ధర్మాసనం పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 06:20 AM