Share News

ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాల్సిందే..

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:21 AM

ఆలయాలు, మఠాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని, కొన్ని వర్గాలకే అనుమతి ఇచ్చి మరికొన్ని వర్గాలను నిరాకరించ టం వల్ల హిందూమతంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సమాజంలో చీలికలు వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది....

ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాల్సిందే..

  • కొన్ని వర్గాలనే అనుమతిస్తే హిందూమతానికి నష్టం

  • సమాజంలో చీలికలు వస్తాయి

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • 1957 నాటి కేసులో తీర్పును ప్రస్తావించిన జస్టిస్‌ నాగరత్న

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: ఆలయాలు, మఠాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని, కొన్ని వర్గాలకే అనుమతి ఇచ్చి మరికొన్ని వర్గాలను నిరాకరించ టం వల్ల హిందూమతంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సమాజంలో చీలికలు వస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శబరిమలతోపాటు దేశంలోని కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల మీద 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణను గురువారం కొనసాగించింది. అయ్యప్ప సేవా సమాజం, నాయర్‌ సేవా సమాజం, క్షేత్ర సంరక్షణసమితి తరఫున సీనియ ర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ.. కొన్నివర్గాల కోసం ఉన్న ఆలయాలు ఆ వర్గాలకే అనుమతి ఇస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ‘ఏ ఆలయంలోనైనా, మఠంలోనైనా ఏదో ఒక వర్గానికే అనుమతి ఉందని, ఇతరులకు లేదని, ఇది ఆ ఆల యం, మఠం సం ప్రదాయంలో భాగమ ని ఎవరైనా చెబితే అది హిందూ మతానికి మంచిది కాదు. అనుమతి ఉన్న ఆ ప్రత్యేక వర్గానికి కూడా ఇది నష్టదాయకంగా పరిణమిస్తుంది’ అని తెలిపారు. 1957లో ‘వెంకటరమణ దేవరు, మైసూరు రాష్ట్రం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ నాగరత్న ప్రస్తావించారు. కర్ణాటకలోని వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత బ్రాహ్మణులకు తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండేది కాదు. ఈ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టి హిందువులు అందరికీ ప్రవేశం కల్పిస్తూ నాడు తీర్పు చెప్పింది. దీనిని గుర్తు చేస్తూ, ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ ఏకీభవించారు.


స్త్రీ దేవతలకు మగవాళ్లు భక్తులు..

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు కొనసాగించారు. దేశంలో కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేనట్లుగానే.. మరికొన్ని ఆలయాల్లో పురుషులకు కూడా ప్రవేశం ఉండదని, ఉన్నా కూడా ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే ఉంటుందని.. ఇవన్నీ విశ్వాసాలు, ఆచారాల్లో భాగమేగానీ.. లింగ వివక్షకు సంబంధించినవి కావన్నారు. అందువల్లే, ఈ అంశం న్యాయసమీక్ష కిందికి రాదని స్పష్టం చేశారు. పురుషులను అనుమతించని, ఆంక్షలతో మాత్రమే అనుమతించే ఆలయాల గురించి చెబుతూ.. కేరళలోని అట్టుకల్‌ భగవతి, చక్కులతుకవు, కొట్టన్‌కులంగర శ్రీదేవి ఆలయాలు, పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయం, కన్యాకుమారిలోని భాగవతి అమ్మన్‌ ఆలయం, బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని మాతా ఆలయం, అసోంలోని కామరూప కామాఖ్య ఆలయాల్లో అమలవుతున్న సంప్రదాయాలను వివరించారు. హిందూమతం మహిళలకు పురుషులతో సమానస్థాయి మాత్ర మే కాదు.. అంతకంటే గౌరవనీయమైన స్థానం ఇచ్చిందని, చారిత్రకపూర్వ కాలం నుంచి కూడా స్త్రీత్వాన్ని పూజించే సంప్రదాయం ఉందని తెలిపారు. స్త్రీ దేవతల్ని పూజించి, వారికి పురుషులు కూడా భక్తులుగా మారే సంప్రదాయం హిందూమతంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు కొనసాగించనుంది.

Updated Date - Apr 10 , 2026 | 03:21 AM