సుప్రీంకోర్టులో సమతుల్యత ఏదీ?
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:45 AM
సుప్రీంకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ మంగళవారం ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల ఎంపిక ఎలా జరుగుతోంది? ఏ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
యూపీ నుంచి నలుగురు జడ్జిలు.. గుజరాత్ నుంచి ముగ్గురు
తెలంగాణ, ఏపీ, కేరళ నుంచి ఒక్కొక్కరే..
ప్రాతినిధ్యం లేని హైకోర్టులు 7
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై అస్పష్టత
పేర్లను సిఫారసు చేస్తున్నా కారణాలు, అర్హతలు వెల్లడించని కొలీజియం
నియామకాల్లో పారదర్శకత కరవైందని ‘బార్ అండ్ బెంచ్’ కథనం
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల
నియామకాలపై బార్ అండ్ బెంచ్ కథనం
న్యూఢిల్లీ, అక్టోబరు 6: సుప్రీంకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ మంగళవారం ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల ఎంపిక ఎలా జరుగుతోంది? ఏ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు? దేశంలోని అన్ని హైకోర్టులకూ (రాష్ట్రాలకు) సరైన ప్రాతినిధ్యం లభిస్తోందా? అన్న అంశాలపై చర్చిస్తూ ప్రముఖ లా వెబ్‌సైట్ ‘బార్ అండ్ బెంచ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలని న్యాయనిపుణులు అభిప్రాయపడుతుంటారు. కానీ, కొన్ని రాష్ట్రాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఉంటే.. మరికొన్నింటికి అసలు ప్రాతినిధ్యమే ఉండటం లేదు. ఉదాహరణకు.. యూపీలోని అలహాబాద్ హైకోర్టు నుంచి ఇప్పటికే ఇద్దరు జడ్జిలు సుప్రీంకోర్టులో ఉండగా, తాజా నియామకాల్లో అదే పేరెంట్ హైకోర్టుగా(జడ్జిగా తొలిసారి నియామకమైన న్యాయస్థానం) ఉన్న మరో ఇద్దరికి అవకాశం దక్కింది. జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ డీకే ఉపాధ్యాయ.. వీరిద్దరి పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టే. దీంతో సుప్రీంకోర్టులో అలహాబాద్ హైకోర్టుకు చెందిన జడ్జిల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్-హరియాణా హైకోర్టులున్నాయి.
వీటి నుంచి ముగ్గురు చొప్పున న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాంబే, కోల్‌కతా, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, మద్రాస్, రాజస్థాన్ హైకోర్టుల నుంచి ఇద్దరేసి చొప్పున ఉంటే.. ఏపీ, ఛత్తీస్ గఢ్, కేరళ, పాట్నా, గౌహతి, మణిపూర్, తెలంగాణ హైకోర్టుల నుంచి ఒక్కొక్క న్యాయమూర్తికి మాత్రమే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉంది. దేశంలోని ఏడు హైకోర్టులకు సుప్రీంకోర్టులో అసలు ప్రాతినిధ్యమే లేదు. వీటిలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్-లఢక్, మేఘాలయ, ఒరిస్సా, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టులున్నాయి.
ఎంపికకు ప్రాతిపదికలు ఏమిటి?
సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ఏ ప్రాతిపదికన సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను ఎంపిక చేసి, వారి పేర్లను సిఫారసు చేస్తుందన్నదానిపై స్పష్టత లేదని ‘బార్ అండ్ బెంచ్’ పేర్కొంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ కొంత అటూఇటుగా(సీజేఐలను బట్టి స్వల్ప తేడాలను మినహాయిస్తే) ఇదే పరిస్థితి. సీనియారిటీ, పేరెంట్ హైకోర్టు ప్రాతినిధ్యం, లింగపరమైన ప్రాతినిధ్యం, వైవిధ్యత, పదవీకాలం తదితర అంశాలను పరిగణిస్తున్నారా? లేక, ఇతరేతర అంశాలేమైనానా? అన్నదానిపై స్పష్టత లేదు. జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ దేశంలోని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో వరుసగా 4, 5, 6వ స్థానాల్లో ఉన్నారు. వారికంటే సీనియర్లు, వివిధ రాష్ట్రాల్లో ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ హరీశ్, జస్టిస్ సౌమేన్, జస్టిస్ సంధావాలియాకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించలేదు.
ఆ రాష్ట్రాలకు అవకాశాలు తక్కువే
సుప్రీంకోర్టులో నియామకాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 124తోపాటు ‘మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్’ నిర్దేశిస్తుంది. ఈ ప్రొసీజర్ ప్రకారం.. సుప్రీంకోర్టులో నియామకం కోసం ఒక జడ్జి పేరును సిఫారసు చేసే ముందు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ), ఆ జడ్జి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తి అభిప్రాయం తెలుసుకుంటారు. మరి, సుప్రీంకోర్టులో అసలు ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో లేరు. అటువంటప్పుడు, హిమాచల్ హైకోర్టు నుంచి ఒక న్యాయమూర్తి పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫారసు చేయాలనుకుంటే.. మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం అభిప్రాయం తెలుసుకోవటానికి అవకాశమే లేదు. దీంతో సుప్రీంకోర్టులో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలతో పోల్చితే ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల నుంచి పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ‘బార్ అండ్ బెంచ్’ పేర్కొంది. న్యాయ నియామకాల్లో సున్నితమైన సమతుల్యతను తీసుకురావటానికి కొలీజియం, కేంద్రప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. సుప్రీంకోర్టు ఇప్పుడున్న కూర్పులో తనను తాను నిజమైన ప్రాతినిధ్య న్యాయస్థానంగా చెప్పుకోగలదా? అంటూ ‘బార్ అండ్ బెంచ్’ ప్రశ్నించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన