వేశ్యావృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు
ABN , Publish Date - May 30 , 2026 | 03:31 AM
స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని, అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తి (సెక్స్ ట్రాఫికింగ్)లో కూరుకుపోయిన వారిని ఒకేలా ...
స్వచ్ఛందంగా ఉంటే అక్రమ రవాణా, ఇతర కేసులు పెట్టొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 29: స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని, అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తి (సెక్స్ ట్రాఫికింగ్)లో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి సమ్మతితో వేశ్యావృత్తిలో ఉన్నవారిని ట్రాఫికింగ్ బాధితులుగా చూడొద్దని, అదే ట్రాఫికింగ్ అయితే ‘సమ్మతి’ అనేదే చెల్లదని స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిపై అక్రమ రవాణా, ఇతర సీరియస్ క్రిమినల్ కేసులు పెట్టి వేధించవద్దని పేర్కొంది. అదే సమయంలో ట్రాఫికింగ్ బాధితులకు గౌరవప్రదమైన పునరావాసం పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది. మహిళలు, బాలికల అక్రమ రవాణా, బలవంతపు వేశ్యావృత్తికి సంబంధించి ‘బాధితుల రక్షణ ప్రణాళిక’ను అనుసరించాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తమ హృదయాలను స్పృశించిన కేసు అని.. దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది.
22 ఏళ్లనాటి కేసులో కీలక ఆదేశాలు..
మహిళలు, బాలికల అక్రమ రవాణా, బలవంతపు వేశ్యావృత్తి అంశంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై భిన్నమైన కోణాల్లో సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తరచూ విచారణ జరుపుతూ.. అమికస్ క్యూరీలుగా నియమితులైన న్యాయవాదులు, మహిళా, బాలల హక్కుల సంస్థలు, లీగల్ సర్వీసెస్ అథారిటీలు, వివిధ ప్రభుత్వ విభాగాల వాదనలు విని, సూచనలు, సలహాలు స్వీకరించింది. సెక్స్ ట్రాఫికింగ్ బాధితులు, ఆశ్రయ గృహాల పరిస్థితి, ట్రాఫికింగ్ నిరోధన చట్టాల అమలు, వాటి దుర్వినియోగం తదితర అంశాలను పరిశీలించి.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 32, 142వ ఆర్టికల్స్ కింద సుప్రీంకోర్టుకు దఖలు పడిన అధికారం మేరకు.. దేశవ్యాప్తంగా వర్తించేలా ‘బాధితుల రక్షణ ప్రణాళిక’ను అమలు చేయాలని ఆదేశిస్తున్నట్టు తెలిపింది. ఇన్నేళ్లుగా బాధితుల రక్షణ, పునరావాసం, వివిధ విభాగాల సమన్వయం, ట్రాఫికింగ్ చట్టాల దుర్వినియోగం, కేసుల దర్యాప్తులో లోపాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తమ ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించేందుకు మూడు నెలల తర్వాత మరోసారి విచారణ జరుపుతామని తెలిపింది. ఈ తీర్పును సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టిందని, ఇకపై ఈ అంశంలో ఏ పుస్తకాలనూ చూడాల్సిన అవసరం ఉండబోదని భావిస్తున్నామని జస్టిస్ పార్దీవాలా పేర్కొన్నారు.
‘బాధితుల రక్షణ ప్రణాళిక’ మార్గదర్శకాలివీ..
స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని, అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తి (సెక్స్ ట్రాఫికింగ్)లో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడొద్దు. కఠినమైన చర్యలు చేపట్టే ముందు దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలి.
స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని ట్రాఫికింగ్ నేరస్తులుగానీ, బాధితులుగా కానీ పరిగణించవద్దు. బలవంతం, మోసం, బెదిరింపులు, అక్రమ రవాణాతో బలవంతపు వేశ్యావృత్తిలోకి దిగినట్టు గుర్తిస్తే బాధితులుగా పరిగణించాలి.
ట్రాఫిక్ నిరోధక వ్యవస్థతో బాల నేరస్తుల చట్టం, పోస్కో చట్టాన్ని అనుసంధానం చేయాలి. అక్రమ రవాణా నిరోధక వ్యవస్థలు, బాలల సంక్షేమ కమిటీలు, న్యాయ సహాయ సంస్థలు, ప్రభుత్వ ఆశ్రయ/రక్షణ గృహాల మధ్య సమన్వయం కల్పించాలి.
ఆశ్రయ గృహాలకు కనీస ప్రమాణాలు ఉండాలి. మానసిక ఆరోగ్య, వైద్య, న్యాయ సహాయం పరిహారం వంటివి సరిగా అందాలి. వారికి జీవనోపాధి శిక్షణ అందించాలి.