జస్టిస్ సుభాష్‌రెడ్డి సారథ్యంలో విచారణ కమిటీ
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:34 AM
గత నెల ఢిల్లీలో విద్యార్థులు జరిపిన ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు విచక్షణారహితంగా బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి...
సభ్యులుగా ఇద్దరు మాజీ జడ్జిలు,
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ డీజీపీ
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జితో పాటు
పోలీసులపై జరిగిన దాడినీ విచారించాలి
మహిళా నిరసనకారుల మీద వేధింపుల
ఘటనలకు విచారణలో ప్రాధాన్యం ఇవ్వాలి
త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలి
కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 20: గత నెల ఢిల్లీలో విద్యార్థులు జరిపిన ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు విచక్షణారహితంగా బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్‌ఆర్ బిష్ణోయ్ ఉంటారని పేర్కొంది. విద్యార్థుల మీద పోలీసులు పెల్లెట్‌గన్స్ వంటి వాటిని ప్రయోగించటాన్ని విచారించటంతోపాటు, పోలీసుల మీద నిరసనకారులు దాడి జరిపి వారిని గాయపరిచారన్న ఆరోపణల మీద కూడా విచారణ జరపాలని కమిటీని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘చలో పార్లమెంటు’ సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండపై దాఖలైన పలు పిటిషన్‌ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహనల ధర్మాసనం ‘హై పవర్డ్ ఎంక్వయిరీ కమిటీ’ని ఏర్పాటు చేస్తూ ఈ నెల 18న ఆదేశాలు జారీ చేయగా, దీనికి సంబంధించిన వివరాలను గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. సభ్యుల అనుభవం, వ్యక్తిగత నైపుణ్యం, విభిన్న నేపథ్యం వంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారితో కమిటీని నియమించామని ధర్మాసనం పేర్కొంది. కాగా, కమిటీ విచారణ ప్రక్రియకు నిర్ణీత గడువును సుప్రీంకోర్టు విధించకపోవటం గమనార్హం. ఇది ఒక్కసారితో ముగిసేది కాదని, విచారణలో తేలిన అంశాలపై కమిటీ ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలను అందించాలని, వీలైనంత త్వరలో తొలి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కావాలని జరిపిన బలప్రయోగం, మహిళా నిరసనకారులపై జరిగిన దౌర్జన్యం, లైంగిక వేధింపులకు విచారణలో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. గాయాల పాలైన నిరసనకారులకు, పోలీసులకు పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు, ఆస్తులకు జరిగిన నష్టంపైనా దృష్టి పెట్టాలని సూచించింది. విధుల నిర్వహణలో ఉన్న పోలీసులకు తగిలిన గాయాలు, ఫలితంగా వారి కుటుంబాలు అనుభవించిన మానసిక క్షోభ తదితర అంశాలను కూడా పరిశీలించాలని పేర్కొంది.
ఎవరైనా ఫిర్యాదులు సమర్పించవచ్చు
కమిటీ ఎదుట ఎవరైనా హాజరై ఫిర్యాదులు చేయవచ్చని, ఆధారాలు సమర్పించవచ్చని, ఈ మేరకు వారి గోప్యతను కాపాడాలని విచారణ కమిటీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘చలో పార్లమెంటు’కు సంబంధించిన సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీని, పోలీసుల బాడీ వార్న్ కెమెరా రికార్డులను, వీడియోలను, వైర్‌లెస్ కమ్యూనికేషన్ రికార్డులను, పోలీస్ కంట్రో ల్ రూం ఫోన్ రికార్డులను భద్రపరచాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసు విభాగం, పారామిలిటరీ, ఇతర దర్యా ప్తు సంస్థలను ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఈ రికార్డులన్నింటినీ విచారణ కమిటీకి సమర్పించాలని తాజా గా పేర్కొంది. కాగా, ఆరోపణలు వచ్చిన పోలీసు సిబ్బంది, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటానికి.. విచారణ కమిటీ నియామకం ఏ విధంగానూ అడ్డుకాబోదని స్పష్టం చేసింది. కమిటీ చైర్‌పర్సన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాకు సమానమైన గౌరవ వేతనం అందించాలని, ఢిల్లీలో తాత్కాలిక బస ఏర్పాట్లను చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ్యుల గౌరవ వేతనంపై చైర్‌పర్సన్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు