జనగణనలో ‘డ్రాప్‌డౌన్ మెనూ’.. విధానపరమైన నిర్ణయం!
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:58 AM
దేశవ్యాప్తంగా జరగబోయే జనగణన డిజిటల్ ఫారాల్లో ‘ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)’ కులాల పేర్లను ముందుగానే నమోదు చేసిన జాబితా రూపం (డ్రాప్ డౌన్ మెనూ)లో ఉంచాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిష్కరించింది.
దానిపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఓబీసీ సమాఖ్య పిటిషన్‌పై విచారణను ముగించిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ, అక్టోబరు 28: దేశవ్యాప్తంగా జరగబోయే జనగణన డిజిటల్ ఫారాల్లో ‘ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)’ కులాల పేర్లను ముందుగానే నమోదు చేసిన జాబితా రూపం (డ్రాప్ డౌన్ మెనూ)లో ఉంచాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. భారత ఓబీసీ సమాఖ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, పిటిషనర్ల ఆందోళనలను భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది. జనగణన సందర్భంగా కులం పేరు నమోదు చేసేందుకు ప్రజలు స్వయంగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, గుర్తింపు పొందిన ఓబీసీ కులాల జాబితా నుంచి ఎంపిక చేసుకునేలా డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.