మేం భయపడం..
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:50 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం నిర్వహించిన నిరసనకు భారీ స్పందన లభించింది.
జైలులో వేస్తారని రాజీపడే, అమ్ముడుపోయే వాళ్లం కాదు
మేం ఈ దేశ యువత, విద్యార్థులం.. ఇది సుదీర్ఘ పోరాటం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమం మొదలెట్టాం
వాళ్లకు సిగ్గులేదు.. మా అకౌంట్లు హ్యాక్ చేశారు: అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ భారీ నిరసన
వేలాదిగా పాల్గొన్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు
కేంద్ర మంత్రి ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాల్సిందే
లేకుంటే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తాం: సీజేపీ
మద్దతు తెలిపిన విపక్షాలు.. సీజేపీ వెనుక కేజ్రీవాల్: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూన్ 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం నిర్వహించిన నిరసనకు భారీ స్పందన లభించింది. పాఠశాల, కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ నిరసనకు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రసంగించారు. ‘మిత్రులారా! ఇది సుదీర్ఘ పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ సోషల్ మీడియాలో మనం నెల కిందట ఉద్యమం ప్రారంభించాం. కానీ, ఈ వ్యక్తులు (కేంద్ర ప్రభుత్వంలోనివారు) ఎంత సిగ్గులేని వారంటే అతడిపై చర్యలు తీసుకునేబదులు మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయటం, మన పోస్టులను డిలీట్ చేయటం వంటి వాటి మీద దృష్టి పెట్టారు. వాళ్లకు నేను చెప్పేదేమిటంటే.. మీరు మా పోస్టులను తొలగించగలరు. కానీ, మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించలేరు’ అని పేర్కొన్నారు. అమెరికా నుంచి తన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ.. శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే ముందు ఇవే తన జీవితంలో స్వేచ్ఛకు సంబంధించిన చివరి క్షణాలని అనిపించిందని అభిజీత్ దీప్కే చెప్పారు. అయినప్పటికీ, యువత భవిష్యత్తు కోసం తన స్వేచ్ఛను త్యాగం చేయటానికి పూర్తిగా సిద్ధమయ్యాయనన్నారు.

తాను భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్నప్పటి కంటే అమెరికా నుంచి తిరిగి వస్తున్నప్పుడే తన తల్లి ఎక్కువగా ఏడ్చారని, భారత్‌లో దిగగానే తనను అరెస్టు చేస్తారని ఆమె భయపడ్డారని వెల్లడించారు. ‘ఇది కేవలం మా అమ్మ భయం మాత్రమే కాదు. రాజకీయాల మీద స్పందించే ప్రతీ యువతి, యువకుడి తల్లిదండ్రుల భయం ఇది. ఎంతకాలం భయంలో బతుకుదాం? వారికి (ప్రభుత్వానికి) చెప్పండి.. మేం భయపడటం లేదని’ అని పిలుపునిచ్చారు. నిరసనలో పాల్గొన్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఇంట్లో కూర్చొని ఏడవటమో, రోడ్డు మీదకొచ్చి విధ్వంసం సృష్టించటమో కాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను చూస్తే తనకు ముచ్చటేస్తుందన్నారు. దీప్కేను కాక్రోచ్ ఇన్ చీఫ్(ప్రధాన బొద్దింక)గా అభివర్ణించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య, సీపీఐకి చెందిన అన్నీ రాజా, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సీజేపీకి సంకేతంగా పలువురు కాక్రోచ్ మాస్కులను ధరించారు. ఉదయం 11 నుంచి మొదలైన నిరసన ప్రదర్శన మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగింది. అభిజిత్ దీప్కేకు నలతగా ఉండటంతో నిరసనను ముగించారు. కాగా, నిరసన సమయంలో గందరగోళం సృష్టించటానికి ప్రయత్నిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ విమర్శలు
కాక్రోచ్ ఉద్యమానికి పలు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. దేశ యువతలో నెలకొన్న నిరాశకు, ఆగ్రహానికి వ్యక్తీకరణే ఈ ఉద్యమమని ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వారిని దేశవ్యతిరేకులని నిందించే బదులు వారి సమస్యలు తీర్చటంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ‘భారత యువత ఒక విప్లవాన్ని ప్రారంభించింది’ అని అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం భిన్నంగా స్పందించింది. సీజేపీని నడిపిస్తున్నది కేజ్రీవాలే అని సుప్రియ శ్రీనాథె విమర్శించారు.
దేశవ్యాప్త ఉద్యమం
నిరసన ముగిసిన అనంతరం సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రణ్‌కా, సౌరవ్‌దాస్ విలేకర్లతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు ధర్మేంద్ర ప్రదాన్‌తో ప్రధాని మోదీ రాజీనామా చేయించాలని, లేదంటే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు. భారతదేశ జెన్‌జీ రక్తంలో గాంధీజీ, అంబేద్కర్ ఉన్నారని.. ఇంత పెద్ద సంఖ్యలో నిరసనకు దిగినా.. క్రమశిక్షణతో, శాంతియుతంగా ఉండటమే దీనికి నిదర్శమని చెప్పారు.