Share News

మనసును కలిచివేసే సంఘటన.. తండ్రిని భుజం మీద మోస్తూ..

ABN , Publish Date - Feb 05 , 2026 | 07:18 AM

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ సరైన విధంగా సహాయం లభించకపోవడంతో అతడు తండ్రిని భుజాలపై మోసుకుని ఆస్పత్రి కారిడార్లలో తిరగాల్సి వచ్చింది.

మనసును కలిచివేసే సంఘటన.. తండ్రిని భుజం మీద మోస్తూ..
hospital neglect India

ఇంటర్‌నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో మనసును కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సంఘటన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. గుణ జిల్లాకు చెందిన మునేశ్ రఘువంశీ అనే వ్యక్తి తన తండ్రి ఇమ్రట్ సింగ్‌ను తీసుకుని గుణ జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. వాహనం వారిని ఆస్పత్రి గేట్ వద్ద దించేసి వెళ్లిపోయింది. ఇమ్రట్ వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నాడు. మునేశ్ స్ట్రెచర్ కోసం చూశాడు. ఎక్కడా స్ట్రెచర్ దొరకలేదు. ఆస్పత్రి సిబ్బంది కూడా అతడికి సాయం చేయడానికి రాలేదు. దీంతో తండ్రిని భుజాలపై వేసుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లాడు.


కొన్ని నిమిషాల పాటు ఆస్పత్రి కారిడార్స్‌లో తిరిగాడు. ఆస్పత్రి సిబ్బందిలో ఒక్కరు కూడా వారికి సాయం చేయడానికి రాలేదు. కనిపించిన ప్రతీ ఒక్క డాక్టర్‌ను.. ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా ఓ స్ట్రెచర్ ఏర్పాటు చేశారు. అయితే, సమస్య అంతటితో తీరలేదు. మునేశ్ తన తండ్రిని తీసుకుని సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లాల్సి వచ్చింది. లిఫ్ట్ పాడైపోవటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మనేశ్ ఒక్కడే స్ట్రెచర్‌ను లాక్కుంటూ సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అతడు అంత కష్టపడుతున్నా కూడా ఎవ్వరూ సాయం చేయడానికి రాలేదు. ఇమ్రట్ పరిస్థితి చూసి ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు.


ఆస్పత్రిలో మొత్తం 15 మంది వార్డ్‌బాయ్స్ పని చేస్తున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో ఉంది. కానీ, ఒక్కరు కూడా మునేశ్, ఇమ్రట్‌లకు సాయం చేయడానికి రాలేదు. మునేశ్ తనకు ఎదురైన దారుణ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న హై బీపీ రోగి. సరైన సమయంలో వైద్యం చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆస్పత్రి సిబ్బంది ఎవ్వరూ నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చాలా ఇబ్బందులు పడ్డాను’ అంటూ వాపోయాడు.


ఇవి కూడా చదవండి

ఆలయాల్లో రద్దీని నియంత్రించండి: దేవదాయ శాఖ

బావి @ 180 ఏళ్లు

Updated Date - Feb 05 , 2026 | 07:53 AM