సోషల్ మీడియా వినియోగంపై వయసుల వారీ నియంత్రణలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:13 AM
సోషల్ మీడియా వినియోగం విషయంలో వయసుల వారీగా నియంత్రణలు పెట్టే అంశాన్ని సోషల్ మీడియా వేదికలతో చర్చిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు...
చట్టం చేయడంపై కంపెనీలతో చర్చిస్తున్నాం
కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: సోషల్ మీడియా వినియోగం విషయంలో వయసుల వారీగా నియంత్రణలు పెట్టే అంశాన్ని సోషల్ మీడియా వేదికలతో చర్చిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. మంగళవారం ఆయన ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో డీప్ ఫేక్ పోస్టుల మీద, వయసుల వారీ నియంత్రణల మీద ఏం చేయాలనే దాని మీద సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో సోషల్ మీడియాపై ఎలాంటి నియంత్రణలు వచ్చినా అది మెటా, గూగుల్ లాంటి సంస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్పెయిన్ దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా చర్యలు తీసుకున్నాయి. ఈ దేశాలలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతా అనుమతించరు. 13-16 వయసు పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో అనుమతిస్తారు. కొత్త వాళ్లకు మెసేజ్ చేసే అవకాశం ఉండదు. టార్గెటెడ్ యాడ్స్ ఉండవు. ఇదిలా ఉండగా, వారం రోజుల్లో భారత్‌కు 20,000 జీపీయూల డేటా స్టోరేజీ అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 38,000 జీపీయూ అందుబాటులో ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో రూ.18 లక్షల కోట్లు ఏఐ రంగంలో పెట్టుబడులు వస్తాయన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ తొలిరోజు అతిథులకు ఇబ్బందులు తలెత్తడంపై అశ్విని వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. సోమవారం కార్యక్రమానికి 70 వేల మంది వచ్చారని తెలిపారు. మిగిలిన రోజుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా, ఏఐ అధీకృత సమాచారం కోసం సంప్రదాయ మీడియా సంస్థల మీద ఆధారపడుతోందని, కాబట్టి ఏఐ సంస్థలు మీడియా సంస్థలకు తన ఆదాయం నుంచి కొంత పరిహారం ఇవ్వాలని అశ్వనీ వైష్ణవ్ సూచించారు. సమాచార సేకరణలో సంప్రదాయ మీడియా ఎంతో శ్రమిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ