Share News

ఆప్‌ కోయిల ముందే కూసింది!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:34 AM

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గట్టి షాకే ఇచ్చారు. తెరచాటు వ్యూహంతో ఏడుగురు ఆప్‌ ఎంపీలను తమ వైపు లాగేసి నివ్వెరపరిచారు...

ఆప్‌ కోయిల ముందే కూసింది!

  • ఏడుగురు ఎంపీల జంపింగ్‌కు అసలు ముహూర్తం రేపు!

  • కేజ్రీవాల్‌కు తెలిసిపోవడంతో 24నే ముగించిన రాఘవ్‌ చద్దా

  • కొన్నేళ్లుగా అమిత్‌షా తెరచాటు వ్యూహం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గట్టి షాకే ఇచ్చారు. తెరచాటు వ్యూహంతో ఏడుగురు ఆప్‌ ఎంపీలను తమ వైపు లాగేసి నివ్వెరపరిచారు. ‘కరుడుగట్టిన నిజాయితీపరుడి’గా పేరున్న కేజ్రీవాల్‌కు కళ్లు చెవుల్లా మసలిన రాఘవ్‌ చద్దా, అశోక్‌కుమార్‌ మిత్తల్‌ సైతం బీజేపీలో చేరిపోవడాన్ని ఆప్‌ నాయకులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇది కేజ్రీకి పూర్తిగా తెలియని విషయం కూడా కాదు. ఈ ఎంపీలు ఈ నెల 28న (మంగళవారం) చేరడానికి ముహూర్తం ఖరారు కాగా.. ఆయనకు ముందే తెలిసిపోయింది. దీంతో కంగారుగా వారికి ఫోన్లు చేశారు. వారిలో కొందరు స్పందించారు. ఇంకొందరు ఫోనెత్తలేదు. దరిమిలా ముహూర్తం మారింది. వేదికా మారింది. ముందుగానే.. అంటే 24నే చద్దా, మిత్తల్‌, మరో ఎంపీ సందీప్‌ పాఠక్‌ విలేకరుల సమావేశం పెట్టి ఆప్‌కు రాజీనామా చేస్తున్నామని.. మొత్తం 10 మంది ఎంపీల్లో ఏడుగురు (రాజీందర్‌ గుప్తా, విక్రమ్‌జిత్‌ సాహ్నీ, హర్భజన్‌సింగ్‌, స్వాతి మలివాల్‌తో కలిపి) తమ పక్షాన ఉన్నందున బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఇదేదో వారం పది రోజులో, ఒకట్రెండు నెలల కసరత్తు కాదు. కొన్నేళ్లుగా అమిత్‌షా అమలు చేస్తూ వచ్చిన వ్యూహం. అలాగే ఇది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్‌ కోసం అమలు చేసిన వ్యూహం కాదు. పూర్తిగా పార్లమెంటరీ వ్యూహం. ఈ ఎంపీల చేరిక పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కొంత లాభించవచ్చు. కానీ తక్షణ ప్రయోజనం మాత్రం రాజ్యసభలో దాని బలం పెరగడం. జమిలి ఎన్నికల బిల్లు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని మోదీ, అమిత్‌షా గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రతి ఓటూ కీలకమైనదే. ఆ ఎంపీల చేరికతో ఇప్పుడు ఎగువ సభలో ఆ పార్టీ బలం 113కి చేరింది. 245స్థానాల సభలో మ్యాజిక్‌ మార్క్‌ 123కాగా.. ఎన్‌డీఏ సభ్యుల సంఖ్య 146కి చేరింది.


చద్దా.. ఫీల్డ్‌ కమాండర్‌!

కేజ్రీవాల్‌కు సన్నిహితులుగా ఉన్న ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించడం సామాన్య విషయం కాదు. ఈ ఆపరేషన్‌లో హోం శాఖ (అమిత్‌షా) మిలిటరీ జనరల్‌ అనుకుంటే రాఘవ్‌ చద్దా ఫీల్డ్‌ కమాండర్‌ అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేజ్రీవాల్‌కు చద్దా అత్యంత సన్నిహితుడు. పార్టీ పెట్టకముందు నుంచీ దగ్గరగా ఉన్నారు. సీఏ కావడంతో పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసేవారు. పార్టీలో నంబర్‌ టూ అనుకునేవారు కూడా. ఈయన రాజ్యసభలో ఆప్‌ పక్ష ఉపనేతగా ఉండేవారు. బీజేపీ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. అలాంటి వ్యక్తి.. షాతో ఎలా టచ్‌లోకి వెళ్లారు? 2022లో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, నాటి సీఎం కేజ్రీవాల్‌కు ప్రమేయం ఉందన్న ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తు.. తర్వాత వారి అరెస్టులు.. జైలుపాలవడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వంద కోట్ల ముడుపులు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బహిర్గతం చేశాక.. కేసు చద్దావైపు మళ్లనుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆ వెంటనే కుటుంబ సంబంధాల కారణంగా బాలీవుడ్‌, ఢిల్లీ రాజకీయ వర్గాల పలుకుబడితో ఆయనకు మోక్షమార్గం దొరికింది. కేసు గొడవలు సద్దుమణిగేదాకా.. లండన్‌ వెళ్లి కొద్ది నెలలు అక్కడే ఉండాలని హోం శాఖ నుంచి సమాచారం అందింది. దాంతో 2024 మార్చిలో ఆయన కంటి శస్త్రచికిత్స కోసం అక్కడకు వెళ్లారు. నెలలు గడచిపోయాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికీ రాలేదు. ఆప్‌ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పూర్తిగా ‘మారిన మనిషి’గా తిరిగొచ్చారు. రాజ్యసభలో గతంలో మాదిరిగా ఆవేశపూరిత ప్రసంగాల్లేవు. బీజేపీకి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదివరకు సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులన్నీ క్రమంగా మాయమవుతూ వచ్చాయి. తటస్థంగా మాట్లాడడం మొదలైంది. ఈ మార్పును ఆప్‌ నాయకత్వం పసిగట్టింది. రాజ్యసభాపక్ష ఉప నేత పదవి నుంచి తప్పించింది. ఆ స్థానంలో అశోక్‌ మిత్తల్‌ను నియమించింది. చద్దా నిశ్శబ్దంగా మిత్తల్‌ సహా మిగతా ఐదుగురు ఎంపీలకు గాలం వేశారు.


బీసీసీఐ గుప్పిట్లో హర్భజన్‌..!

క్రికెటర్‌గా ప్రఖ్యాతుడైన ‘టర్బనేటర్‌’ హర్భజన్‌సింగ్‌ను కేజ్రీవాల్‌ పంజాబ్‌ నుంచి రాజ్యసభకు పంపారు. అయితే ఈయన సభలో పెద్ద క్రియాశీలంగా ఉండరు. తరచూ డుమ్మా కొడతారు. ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ జరిగితే బీసీసీఐ నుంచి ఆదేశాలు వస్తేనే హాజరవుతారని అంటారు (బీసీసీఐని శాసించేది అమిత్‌షా కుమారుడు, ఐసీసీ చైర్మన్‌ అయిన జై షా అన్న సంగతి తెలిసిందే). ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు విపక్షాల అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి ‘ఆప్‌’ మద్దతిచ్చింది. ఎన్‌డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్‌ బరిలో నిలిచారు. గత ఏడాది సెప్టెంబరు 9న పోలింగ్‌ జరిగింది. హర్భజన్‌ అప్పుడు ఢిల్లీలో లేరు. అంతే.. ఆప్‌ నుంచి కాదు.. బీసీసీఐ నుంచి ఆయనకు ఆదేశం వెళ్లింది.. వెంటనే విమానంలో ఢిల్లీ వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. 24న బీజేపీలో విలీనమవుతున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు రాసిన లేఖలో ఆయన కూడా సంతకం చేశారు.

జరిగింది ఇదీ..

హోంమంత్రి అమిత్‌షా బెంగాల్‌ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. 27న అంటే సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఆ వెంటనే షా ఢిల్లీ చేరుకుంటారు. ఏడుగురు ఎంపీలూ ఆయన్ను కలిసి ఆశీర్వా దం తీసుకుంటారు. 28న ఆప్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించాలన్నది ముందస్తు ప్రణాళిక. అయితే ఈ నెల 22వ తేదీ ఉదయం.. పార్లమెంటు ప్రాంగణం నుంచి కేజ్రీవాల్‌కు ఫోన్‌ వచ్చింది. ఒకరిద్దరు కాదు.. ఏడుగురు ఎంపీలు జారిపోతున్నారన్న సమాచారంతో ఆయన నీరుగారిపోయారు. ఆ ఎంపీలకు వరుసగా ఫోన్లు చేశారు. కొందరు ఫోన్‌ తీయలేదు. కొందరు ఆయనతో మాట్లాడారు. పార్టీ మారడంలాంటిదేమీ లేదని నమ్మబలికారు. అయినా ఆ సాయంత్రానికి ఆయనలో మరిన్ని అనుమానాలు. ఈలోపు హోంశాఖ నుంచి ఆ ఎంపీలకు ఆదేశం వెళ్లింది. సోమ, మంగళవారాల దాకా వేచిచూడొద్దు.. షాను కలవాల్సిన పనిలేదు.. శుక్రవారమే ప్రకటించి చేరిపోండని దాని సారాంశం. దరిమిలా బీజేపీలో విలీనమవుతున్నట్లు లేఖపై ఎంపీలు సంతకాలు చేసేశారు. 24న చద్దా, మిత్తల్‌, పాఠక్‌ మీడియా తో విషయం చెప్పడం.. మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్‌ను కలిసి మిఠాయిలు తినిపించుకోవడం చకచకా జరిగిపోయాయి.


పాఠక్‌ వెన్నుపోటు..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఒంటిచేత్తో గెలిపించిన వ్యక్తి సందీప్‌ పాఠక్‌. జీరోగా ఉన్న పార్టీని దశాబ్దకాలంపాటు అహర్నిశలు శ్రమించి నిర్మించారు. ప్రతి జిల్లా అధ్యక్షుడు, గ్రామస్థాయి నేత, బూత్‌ స్థాయి కార్యకర్త.. ఇలా అందరూ ఆయనకు తెలుసు. 117 స్థానాల పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌ 92 సీట్లతో క్లీన్‌స్వీప్‌ చేసిందంటే అది ఆయన ఘనతే. అయితే ఢిల్లీలో ఆప్‌ పరాజయం తర్వాత.. ఆయన్ను కేజ్రీవాల్‌ పక్కనపెడుతూ వచ్చారు. అయినా ఆయన ఏనాడూ బహిరంగంగా స్పందించలేదు. 24వ తేదీ ఉదయం కూడా ఆయనతో కేజ్రీవాల్‌ ఫోన్లో మాట్లాడారు. పాఠక్‌ మనతోనే ఉన్నారని చెబుతూ వచ్చారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు మిత్తల్‌తో కలిసి చద్దా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. పాఠక్‌ హఠాత్తుగా అక్కడకు వచ్చి కూర్చోవడం చూసి కేజ్రీవాల్‌ బిత్తరపోయారు. చద్దా కంటే ఈయన వెళ్లిపోవడమే కేజ్రీవాల్‌కు పెద్దనష్టమని ఆప్‌ వర్గాలు అంటున్నాయి. ఇక ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఆప్‌కు దూరంగా ఉంటున్నారు. కేజ్రీవాల్‌ నివాసంలో ఆమెపై దాడి జరిగినప్పటి నుంచి ఆయనపై విరుచుకుపడుతున్నారు.

పారిశ్రామికవేత్తలకు టికెట్లు ఇచ్చి..

ఆమ్‌ ఆద్మీ.. పంజాబ్‌ పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపింది. ఈ ఎంపీలు బీజేపీకి ‘బీ-టీం’ అని అంటారు. వీరిలో ఒకరైన రాజీందర్‌ గుప్తా పంజాబ్‌లో ప్రసిద్ధ ట్రైడెంట్‌ గ్రూపు వ్యవస్థాపకుడు. జౌళి, కాగిత పరిశ్రమల ప్రముఖుడు. కేంద్రప్రభుత్వంతో సన్నిహితసంబంధాలు కలిగిన వ్యక్తి. గత ఏడాది నవంబరులో పంజాబ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సభలో ఆయన కనిపించరు. బీజేపీని విమర్శించరు. మరో వ్యాపారవేత్త విక్రమ్‌జిత్‌ సాహ్నీ సామాజిక కార్యకర్త.. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆయన కూడా అరుదుగా సభలో దర్శనమిస్తారు. చర్చల్లో పాలుపంచుకోరు. పార్టీ విప్‌లతో ఆయనకు సంబంధం లేదు. కానీ బిల్లులపై ఓటింగ్‌ జరిగితే పాల్గొంటారు. ఇక పంజాబ్‌లో ప్రైవేటు విద్యాసంస్థల అధినేత, లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ అశోక్‌కుమార్‌ మిత్తల్‌ కూడా కేజ్రీవాల్‌కు సన్నిహితుడే. చద్దాను తీసివేసి ఈయననే రాజ్యసభలో ఉపనేతగా నియమించారు. సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేసిన తర్వాత ఈయ న అధికారిక నివాసంలోనే ఈ నెల 23వరకు ఉండడం గమనార్హం. ఈనెల 15న ఈడీ మిత్తల్‌ ఇంటి తలుపులు తట్టింది. అంతే.. విలీన ఎంపీల జాబితాలో ఆయనా చేరిపోయారు.

Updated Date - Apr 27 , 2026 | 04:34 AM