Share News

డిసెంబర్‌లో స్వదేశానికి వెళతాను.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:49 PM

డిసెంబర్‌లో తాను స్వదేశానికి తిరిగెళ్లాలని అనుకుంటున్నట్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తాజాగా తెలిపారు.

డిసెంబర్‌లో స్వదేశానికి వెళతాను.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా
Sheikh Hasina

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్‌లో తాను స్వదేశానికి తిరిగెళ్లాలని అనుకుంటున్నట్టు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తాజాగా తెలిపారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు అనంతరం షేక్ హసీనాతో పాటు పలువురు ఆవామీ లీగ్ నేతలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆమె దేశాన్ని వీడాల్సి వచ్చింది. ఈ నిరసనల్లో సంభవించిన మరణాలకు షేక్ హసీనా బాధ్యురాలని నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ తేల్చింది. ఆమెకు మరణ శిక్ష కూడా విధించింది. అప్పటి హోం మంత్రికి కూడా మరణ శిక్షను ఖరారు చేసింది.


తాను మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నట్టు షేక్ హసీనా తాజాగా తెలిపారు. బహిష్కరణకు గురైన ఇతర ఆవామీ లీగ్ నేతలు కూడా స్వదేశానికి వెళతారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో కోర్టు ముందు లొంగిపోతానని ఆమె చెప్పారు. అధికారులు తనను అరెస్టు చేయవచ్చని అన్నారు. తనను చంపే అవకాశం కూడా ఉందని చెప్పారు. అయినా వెళ్లక తప్పదని అన్నారు. ప్రస్తుతం ఆవామీ లీగ్‌పై బంగ్లాదేశ్‌లో నిషేధం ఉంది. స్వదేశానికి వెళ్లాక నిషేధాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేయనున్నానని కూడా షేక్ హసీనా చెప్పారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుస్తోందని ఆరోపించారు. అక్కడ మళ్లీ ప్రజాస్వామ్య ప్రక్రియలను పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అయితే, తిరిగెళ్లే విషయమై అక్కడి అధికారులతో ఇంకా ఎలాంటి సంప్రదింపులు మొదలు కాలేదని తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

దూసుకొస్తున్న రక్కసి తుఫాను.. చైనాలో హైఅలర్ట్‌..

హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ లేదు: అమెరికా సెంట్రల్ కమాండ్

Updated Date - Jul 10 , 2026 | 04:47 PM