Share News

డీలిమిటేషన్‌తో రాజకీయ డీమానిటైజేషన్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:59 AM

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌...

డీలిమిటేషన్‌తో రాజకీయ డీమానిటైజేషన్‌

  • పునర్విభజనపై లోతైన చర్చ అవసరం: శశిథరూర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. డిలిమిటేషన్‌ ప్రక్రియలో తొందపాటు రాజకీయ డీమానిటైజేషన్‌కు దారి తీస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్‌ రూపంలో దేశంలోని మహిళలకు కానుక ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారని, కానీ ఆయన ఆ కానుకను ముళ్లకంచెలో చుట్టి ఇస్తున్నారని విమర్శించారు. శశిథరూర్‌ ఈ మేరకు లోక్‌సభలో శుక్రవారం మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తొందరపాటు పనికి రాదని సూచించారు. నోట్లు రద్దు సమయంలో ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూశామని.. ఇప్పుడు డీలిమిటేషన్‌ అప్పుడు కూడా అలానే చేస్తే అది ‘పొలిటికల్‌ డీమానిటైజేషన్‌’కు దారి తీస్తుందని థరూర్‌ హెచ్చరించారు. పునర్విభజన విషయంలో మూడు అంశాలు అత్యంత కీలకమని థరూర్‌ అన్నారు. ‘‘చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య సమానత్వం ఉండడం. కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలు.. ముఖ్యంగా దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలతో సమానత్వం తేవడం. కేంద్ర ఖజనాకు వచ్చే ఆదాయంలో అధిక వాటాను అందిస్తున్న రాష్ట్రాలకు, తక్కువ వాటా అందిస్తున్న రాష్ట్రాలకు మధ్య కూడా సమానత్వంతీసుకురావడం’’పై చర్చ జరగాలన్నారు. 50 శాతం సీట్ల పెంపు అంటూ అమిత్‌ షా లోక్‌సభలో గురువారం ప్రతిపాదించిన విధానం రాజకీయ హామీ మాత్రమేనని అన్నారు. అలాగే, లోక్‌సభ స్థానాల పెంపు అంశంపై మాట్లాడుతున్న ప్రభుత్వం రాజ్యసభ విస్తరణ అంశంపై స్పందించడం లేదని థరూర్‌ పేర్కొన్నారు. లోక్‌సభతోపాటు రాజ్యసభ సీట్లను పెంచకుంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 06:59 AM