తమిళనాడులో భారీ విధ్వంసం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, సామగ్రి
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:29 AM
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో భారీ విధ్వంసం జరిగింది. టోర్నడో లాంటి వాతావరణం ఏర్పడి వాగైకుళం, ముడివైతానెండల్ గ్రామాలను అతలాకుతలం చేసింది. చూసేందుకు అచ్చం టోర్నడోలాగా ఉన్న గాలి ప్రవాహం ఆ రెండు గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది.
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో భారీ విధ్వంసం జరిగింది. టోర్నడో లాంటి వాతావరణం ఏర్పడి వాగైకుళం, ముడివైతానెండల్ గ్రామాలను అతలాకుతలం చేసింది. చూసేందుకు అచ్చం టోర్నడోలాగా ఉన్న గాలి ప్రవాహం విధ్వంసం సృష్టించింది. తూత్తుకుడి విమానాశ్రయం సమీపంలోని ఇళ్లు, ఓ టోల్ ప్లాజా, ప్రైవేట్ థీమ్ పార్కుపై విరుచుకుపడింది. అయితే, ఇది టోర్నడో కాదని క్యుములోనింబస్ మేఘ వ్యవస్థకు సంబంధించి శక్తివంతమైన ఉరుములతో కూడిన గాలి ప్రవాహమని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
క్యుములోనింబస్ కారణంగా బలమైన స్థానిక గాలులు, దుమ్ము రేగడంతో పాటు అప్‌డ్రాఫ్ట్‌లనే తీవ్రమైన పైకి కదిలే గాలి ప్రవాహాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అయితే, దీని కారణంగా దాదాపు 200 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు, సామగ్రి, ఇతర వస్తువులు గాలిలోకి ఎగిరిపోయాయి. భయంకరమైన గాలుల వల్ల భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి లోనైయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా.. ప్రాణనష్టం తప్పింది.
మరోవైపు వాగైకుళం టోల్ ప్లాజాలోని కంప్యూటర్లు, ఇతర పరికరాలు దెబ్బతినడంతో టోల్ వసూళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. టోల్ చెల్లించకపోయినా వాహనాలను వెళ్లనిచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ థీమ్ పార్క్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ విధ్వంసం కారణంగా సుమారు రూ.5కోట్ల నుంచి రూ.6కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఖతార్‌లో భారీ అగ్నిప్రమాదం, 54మందికి గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు..
తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..