సుప్రీంకోర్టులోకాంట్రాక్ట్ లెక్చరర్లకు నిరాశ
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:50 AM
తెలంగాణలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు మంగళవారం సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది.
సర్వీసు క్రమబద్ధీకరణపైఆదేశాల జారీకి నిరాకరణ
విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ప్రకటన
న్యూఢిల్లీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు మంగళవారం సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సర్వీసు క్రమబద్ధీకరణపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. జూనియర్ కళాశాలల్లో 1987 నుంచి 1992 మధ్య కాలంలో వివిధ సబ్జెక్టుల్లో కాలపరిమితి (పార్ట్ టైమ్/టైమ్ స్కేల్) ప్రాతిపదికన లెక్చరర్లుగా చేరిన తమ సర్వీసులను క్రమబద్థీకరించాలని కోరుతూ పలువురు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. జీఓ 212 ప్రకారంగానీ, జీఓ 16 ప్రకారంగానీ క్రమబద్థీకరించాలని విన్నవించారు. 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన నాటి నుంచి లేదా ఖాళీలు ఏర్పడిన నాటి నుంచి క్రమబద్ధీకరించాలని కోరారు. పాత తేదీ నుంచి వర్తించేలా (రెట్రోస్పెక్టివ్‌గా) సర్వీసు ప్రయోజనాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. 5 ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో ఖాళీలు అందుబాటులో ఉన్న తేదీ నుంచి సర్వీసులను నోషనల్‌గా క్రమబద్థీకరించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కొట్టివేసింది. పిటిషనర్లు 1993 కటాఫ్ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయలేదని పేర్కొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 16 ప్రకారం పాత తేదీ నుంచి క్రమబద్థీకరణ చేసే అవకాశం లేదని తెలిపింది..= హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుధాకర్ రెడ్డితోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎం. సురేందర్ రావు వాదనలు వినిపించారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తేదీ నుంచిగానీ, రెగ్యులర్ ఖాళీలు ఏర్పడిన నాటి నుంచిగానీ పిటిషనర్ల సేవలను క్రమబద్థీకరించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రెగ్యులరైజేషన్ కోసం జారీ చేసిన జీవో నంబర్ 16ను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, జారీ చేసే జీవోలు ప్రతి కేసుకు ఒకేలా వర్తించవని తెలిపింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కలుగజేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.