అధికార పార్టీల హవా
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:41 AM
మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఈ నెల 6న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే జయభేరి మోగించాయి.
బెంగాల్ ఉప ఎన్నికల్లో 2 సీట్లలో బీజేపీ జయభేరి
తమిళనాడులో 2 సీట్లు ఖాతాలో వేసుకున్న టీవీకే
అసోంలోని నగావ్ లోక్‌సభ స్థానం బీజేపీదే
పుదుచ్చేరి అసెంబ్లీలో ఏకైక స్థానాన్ని కైవసంచేసుకున్న ఏఐఎన్‌ఆర్‌సీ
బీజేపీ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
న్యూఢిల్లీ/ చెన్నై, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఈ నెల 6న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే జయభేరి మోగించాయి. బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్.. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం.. పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానాలతోపాటు అస్సాంలోని నగావ్ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను రికార్డు స్థాయిలో 1,22,753 ఓట్ల తేడాతో ఓడించారు. హసిరాణికి 1,64,427 ఓట్లు పోలవగా, మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న రెజీనగర్‌లో కూడా బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర సర్కార్ తన సమీప ప్రత్యర్థి, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ(ఏజేయూపీ) అభ్యర్థి గొలామ్‌నబీ ఆజాద్‌పై 75,816 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ దాదాపు 60 శాతం ముస్లిం ఓటర్లే ఉంటారు. అస్సాంలోని నగావ్ లోక్‌సభ స్థానంలో అధికార బీజేపీ అభ్యర్థి దేబాశిష్ శర్మ తన సమీప ప్రత్యర్థి, ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌ను 1,42,224 ఓట్ల తేడాతో ఓడించారు. గెలుపొందిన బీజేపీ అభ్యర్థులనుప్రధానిమోదీ అభినందించారు. ముస్లిం ఓటర్లు బీజేపీని ఆదరిస్తున్నారనటానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.
తమిళనాట టీవీకేదే ఆధిపత్యం..
తమిళనాడులోని మధురాంతకం (ఎస్సీ) అసెంబ్లీ స్థానంలో అధికార తమిళగ వెట్రి కళగం(టీవీకే) అభ్యర్థి మరగతం కుమారవేల్ తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి పరంధామన్‌ను 20,040 ఓట్ల తేడాతో ఓడించారు. ధారాపురం (ఎస్సీ)లో టీవీకే అభ్యర్థి సత్యభామ.. డీఎంకే అభ్యర్థి సుగన్యను 9,471 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ గెలుపుతో తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలం 109 సీట్లకు పెరిగింది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118 కాగా, ఏప్రిల్- మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలిచింది. రెండుసీట్లలో గెలిచిన సీఎం విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవటంతో ఆ పార్టీ బలం 107కు తగ్గింది. తాజాగా 109కి పెరిగింది. పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి స్థానంలో అధికార ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ వినాయగమ్‌ను 8,400 ఓట్ల తేడాతో ఓడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్