రోడ్డు పక్కన నిలిపే వాహనాలతోనే ప్రమాదాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:08 AM
రోడ్డు పక్కన నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా ఎక్కడికక్కడ అక్రమంగా నిలిపే వాహనాల కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది
టోల్‌ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లు ఎందుకు పెట్టకూడదు?
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
తెలంగాణ, రాజస్థాన్ దుర్ఘటనలపై సుమోటో విచారణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: రోడ్డు పక్కన నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా ఎక్కడికక్కడ అక్రమంగా నిలిపే వాహనాల కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జాతీయ రహదారులు ఆక్రమణలకు గురికావడం కూడా ప్రమాదాలకు మరో కారణమని తెలిపింది. ఇలాంటి వాటిపై నిఘా పెట్టేందుకు టోల్‌ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాల కంట్రోలు రూంలు ఎందుకు ఏర్పాటు చేయకూడదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను ప్రశ్నించింది. రాజస్థాన్‌లో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని టెంపో ఢీకొని 15 మంది, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో 19 మరణించిన సంఘటనలపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సుమోటోగా విచారణ జరిపింది. రోడ్డు పక్కన అక్రమంగా వాహనాలు నిలపడం, రోడ్లు ఆక్రమణలకు గురికావడమే ప్రమాదాలకు పెద్ద కారణాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనుమతి లేని స్థలాల్లో వాహనాలు నిలుపుదలను అడ్డుకోవాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశామని తెలిపారు. దీనిని అరికట్టడానికి తనిఖీ బృందాలు, పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘నిఘా కెమెరాల వ్యవస్థ ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదు? అన్ని టోల్‌ప్లాజాల వద్ద మోనటరింగ్ రూంలను ఏర్పాటు చేయవచ్చు’ అని సూచించింది. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా వాహనాల రాకపోకలతోపాటు వాటిని ఎక్కడ అక్రమంగా పార్కు చేస్తున్నదీ గమనించవచ్చని తెలిపింది. తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొంది. నిర్ణీత స్థలంలోనే వాహనాలను నిలిపేలా చూడడంతోపాటు, దాబాల పేరుతో జరిగే రోడ్డు అక్రమణలను అడ్డుకోవాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం సూచనలు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ