ముంబై మేయర్‌గా రీతూ తావడే!
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:36 AM
ముంబై మేయర్ అభ్యర్థిగా మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమి రీతూ తావడేను ఎంపిక చేసింది. బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు...
బీజేపీ కార్పొరేటర్‌ను ఎంపిక చేసిన మహాయుతి
ప్రకటించిన అమిత్ షా.. 11న ఎన్నిక
ముంబై, ఫిబ్రవరి 7: ముంబై మేయర్ అభ్యర్థిగా మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమి రీతూ తావడేను ఎంపిక చేసింది. బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిగా రీతూ తన నామినేషన్‌ను శనివారం అధికారులకు సమర్పించారు. ఫిబ్రవరి 11న ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. డిప్యూటీ మేయర్‌గా శివసేనకు చెందిన సంజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. ఆయన కూడా శనివారం తన నామినేషన్‌ను సమర్పించారు. బృహన్‌ముంబై కార్పొరేషన్(బీఎంసీ)లో మొత్తం 227కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. జనవరిలో ఈ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 89స్థానాలు, శివసేనకు 29స్థానాలు మొత్తం 118 సీట్లు(సగం కన్నా ఎక్కువ) వచ్చాయి. దీంతో, ఈ కూటమి అభ్యర్థే మేయర్, డిప్యూటీ మేయర్ అవుతారు. తద్వారా ముంబైకి మొట్టమొదటిసారి బీజేపీ నుంచి మేయర్ రానున్నారు. 1997నుంచి ముంబైలో శివసేన పార్టీకి చెందినవారే మేయర్‌గా ఉంటున్నారు. ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి లేకపోవడం గడిచిన పాతికేళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. రీతూ మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2012లో బీజేపీలో చేరారు. గతంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎడ్యుకేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఇక, శివసేనలో డిప్యూటీ మేయర్ పదవిని నలుగురు పంచుకునేలా అంతర్గతంగా ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సంజయ్ శంకర్ మొదటి 15నెలలు డిప్యూటీ మేయర్‌గా ఉంటారు. ఇదిలా ఉండగా, 25ఏళ్లుగా ముంబైని ఏలిన శివసేన(ఉద్ధవ్) పార్టీకి ఈ ఎన్నికల్లో 65సీట్లు మాత్రమే వచ్చాయి. బీఎంసీ దేశంలోనే అత్యంత ధనికమైన కార్పొరేషన్. దీని బడ్జెట్ రూ.74,450కోట్లు కావడం విశేషం.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్