Share News

రాజస్థాన్‌ తాత్కాలిక సీజేపై కొరడా

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:28 AM

ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ సంజీవ్‌ప్రకాశ్‌ శర్మ స్థానంలో నూతన సీజేను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు...

రాజస్థాన్‌ తాత్కాలిక సీజేపై కొరడా

  • జస్టిస్‌ సంజీవ్‌ శర్మ స్థానంలో ఛత్తీస్‌గఢ్ సీజే జస్టిస్‌ సంజయ్‌ అగర్వాల్‌

  • తక్షణం బాధ్యతలు చేపట్టేలా కొలీజియం ఉత్తర్వులు

  • న్యాయవాదుల నిరసనతో సెలవులో జస్టిస్‌ శర్మ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ సంజీవ్‌ప్రకాశ్‌ శర్మ స్థానంలో నూతన సీజేను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సంజయ్‌ అగర్వాల్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలో కొలీజియం సోమవారం సమావేశమైంది. రాజస్థాన్‌తోపాటు మధ్యప్రదేశ్‌ (జస్టిస్‌ అల్పేశ్‌ యశ్వంత్‌), జమ్ముకశ్మీర్‌-లఢక్‌ (జస్టిస్‌ పుష్పేంద్రసింగ్‌) హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసింది. రాజస్థాన్‌ తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ప్రకాశ్‌ శర్మ.. సంపన్నుల కేసులను తన ధర్మాసనానికి బదిలీ చేసుకుంటూ వారికి అనుకూలంగా తీర్పులిస్తున్నారని, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి చూపుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ శర్మను తక్షణం ఇంచార్జి సీజే బాధ్యతల నుంచి తప్పించి వేరే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తికి పూర్తిస్థాయి సీజే బాధ్యతలు అప్పగించాలని పేర్కొంటూ జస్టిస్‌ సూర్యకాంత్‌కు మూడు లేఖలు రాసిన విషయం ఇటీవలే వెల్లడైంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కొలీజియం, రాజస్థాన్‌ హైకోర్టుకు కొత్త సీజేగా జస్టిస్‌ సంజయ్‌ను సిఫారసు చేసింది. ఛత్తీ్‌సగఢ్‌ హైకోర్టు నుంచి ఆయన్ను బదిలీ చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించింది. దీంతో జస్టిస్‌ అగర్వాల్‌.. తక్షణం రాజస్థాన్‌కు వెళ్లి సీజేగా బాధ్యతలు చేపట్టటానికి మార్గం సుగమమైంది. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలతో జస్టిస్‌ శర్మ ప్రస్తుతం సెలవులో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 06:30 AM