Share News

విద్యావ్యవస్థను సంఘ్‌ శాసిస్తోంది!

ABN , Publish Date - Jul 30 , 2026 | 05:18 AM

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం అనేది కంటితుడుపు చర్య మాత్రమేనని, నిజానికి ఆయన తన శాఖను ఎప్పుడూ నిర్వహించలేదని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అసలు....

విద్యావ్యవస్థను సంఘ్‌ శాసిస్తోంది!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కంటితుడుపు చర్యే

  • చర్చకు జడిసే అమిత్‌ షా సభకు రాలేదు

  • లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై

  • చర్చ సందర్భంగా రాహుల్‌ వ్యాఖ్యలు

  • ఇడియట్స్‌, అంధభక్తులు అంటూ మాటలు

  • అధికారపక్ష సభ్యుల అభ్యంతరాలు..

  • రికార్డుల నుంచి తొలగింపు

  • గందరగోళం మధ్యే బిల్లుకు ఆమోదం

  • షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

  • విద్యార్థులపై పెల్లెట్‌గన్‌లతో కాల్పులు

  • విలేకరుల సమావేశంలో రాహుల్‌ ఆరోపణలు

  • ప్రియాంక క్షమాపణలు చెప్పాలి

  • నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను

  • బహిష్కరించాలి.. స్పీకర్‌కు జోషి ఫిర్యాదు

  • నా వద్ద వీడియో సాక్ష్యాలున్నాయి: ప్రియాంక

న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం అనేది కంటితుడుపు చర్య మాత్రమేనని, నిజానికి ఆయన తన శాఖను ఎప్పుడూ నిర్వహించలేదని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అసలు.. కేంద్రంలో విద్యాశాఖను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) నడుపుతోందని, విద్యా వ్యవస్థ ఆత్మను సంఘే శాసిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల జ్ఞానాన్వేషణకు, ప్రశ్నలకు అవకాశం లభించడం లేదని, ‘సంఘ్‌ కలలు’ కనే అర్థంలేని చరిత్రను విద్యార్థులు నమ్మాల్సి వస్తోందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు సభకు వచ్చి కూర్చునే ధైర్యం లేదని విమర్శించారు. చర్చకు భయపడే ఆయన సభకు రాలేదని ఆరోపించారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని హోంమంత్రే ఆదేశించి ఉంటారని, లేదంటే ఆయనకు తెలియకుండానే కాల్పులు జరిగి ఉండాలని రాహుల్‌ అన్నారు. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ మాట్లాడారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా విద్యార్థులు తమ ఆకాంక్షలను వెలిబుచ్చారని, వారు చేసిన దాంట్లో ఎలాంటి తప్పూ లేదన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తనతో పంచుకున్న విషయాలను ఆయన సభ దృష్టికి తెస్తూ ఇడియట్స్‌, అంధభక్తులు అనే మాటలను ప్రస్తావించడం సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. సమాజంలో స్వేచ్ఛగా ఆలోచించే ప్రతి వ్యక్తి విద్యార్థేనని, వీరి ప్రయాణం ఎప్పుడూ సత్యం వైపే ఉంటుందని ఆ విద్యార్థిని తనతో చెప్పిందని రాహుల్‌ వెల్లడించారు!


అయితే ‘ఇడియట్స్‌’ అనే మరో వర్గం ఉంటుందని, వీరు తమను తాము దైవసమానులం అని, అన్నీ తెలుసునని అనుకుంటారని, ఎవ్వరు చెప్పినా వినిపించుకోరని ఆమె చెప్పిందని పేర్కొన్నారు. మరి.. మూడో వర్గం మాటేమిటి? అని తాను ఆమెను ప్రశ్నించానని.. దీనికి ఆమె ఎవరా మూడో వర్గం? అని ఎదురు ప్రశ్నించిందని.. తాను ‘అంధభక్తుడు’ అని సమాధానం చెప్పానని పేర్కొన్నారు. ఈ ‘అంధభక్తుడు’ ఏం చేస్తాడు? అని తాను అడిగితే మరో ‘ఇండియట్‌’ను దేవుడిగా భావిస్తాడని ఆమె చెప్పిందని వివరించారు. అయితే ఇడియట్‌, అంధభక్తుడు అనే పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సంఘ్‌, షాకు వ్యతిరేకంగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపైనా సభలో అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆధారాలు చూపాలని లేదా క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్‌ చేసింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడింటిదాకా సభ వాయిదా పడింది. ఆ తర్వాత రాహుల్‌కు మళ్లీ అవకాశం ఇవ్వకుండానే లోక్‌ సభ స్పీకర్‌ బిల్లును ఆమోదింపజేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లుపై చర్చ ప్రారంభమైన తర్వాత జనతాదళ్‌ యునైటెడ్‌ సభ్యుడు దిలేశ్వర్‌ కమైత్‌, కాంగ్రెస్‌ ఎంపీ పప్పు యాదవ్‌, బీజేపీ ఎంపీ భోళా సింగ్‌, ఆర్‌ఎస్పీ ఎంపీ ఎంకే ప్రేమచంద్రన్‌ తదితరులు మాట్లాడిన తర్వాత స్పీకర్‌, రాహుల్‌ గాంధీకి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశంలోని యువత తమ మనోభావాలను వ్యక్తం చేసిందని బీజేపీ నేతల పిల్లలతోపాటు దేశ ప్రజలందరూ వారికి సంఘీభావం ప్రకటించారని రాహుల్‌ పేర్కొన్నారు. విద్యార్థుల అభిప్రాయాలను ప్రతిపార్టీ కూడా గౌరవించాలని చెప్పారు. మన విద్యా వ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నదని, మొత్తం విద్యపై ప్రభుత్వం ఖర్చు పెట్టే దానికంటే ఎక్కువగా ఒక పరీక్షపై విద్యార్థులు ఖర్చు పెడుతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా తాను నోరు తెరిచినప్పుడల్లా అధికారపార్టీ సభ్యులు కేకలు వేస్తున్నారని, అయితే సభలో గందరగోళం జరిగినప్పుడు దానిని చక్కదిద్దాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. బీజేపీ సభ్యులను మాత్రమే మాట్లాడేందుకు అనుమతినిస్తానని స్పీకర్‌ చెబితే, తాను మౌనంగా కూర్చుంటానని తెలిపారు.

ప్రధాని విద్యార్థులను బెదిరించలేదు: పీఐబీ

నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఇటీవల జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను ప్రధాని మోదీ బెదిరించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) తెలిపింది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి పీయుష్‌ గోయెల్‌.. విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయిన వీడియోలు నకిలీవని పీఐబీకి చెందిన నిజనిర్ధారణ యూనిట్‌ తేల్చింది.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 05:19 AM