Share News

నేను ముందే చెప్పా.. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై రాహుల్ గాంధీ

ABN , Publish Date - May 01 , 2026 | 04:15 PM

దేశంలో కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలా జరుగుతుందని ముందే చెప్పానంటూ ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

నేను ముందే చెప్పా.. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై రాహుల్ గాంధీ
Rahul Gandhi on Commercial Gas Cylinder Price Hike

ఇంటర్నెట్ డెస్క్: దేశం‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు శుక్రవారం రూ.993 మేర పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెట్రోల్, డీజిల్ వంతు వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల తరువాత ధరాభారం పెరుగుతుందని తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఎలక్షన్ బిల్లు అని వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు.

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మునుపెన్నడూ చూడని స్థాయిలో ఒక్కసారిగా పెరిగాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.1380ల మేర ధర పెరిగిందని అన్నారు. కేవలం మూడు నెలల్లోనే ధర 81 శాతం మేర పెరిగిందని వివరించారు. ఎన్నికల తరువాత ఇలా జరుగుతుందని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.


‘టీ స్టాల్స్‌, ధాబాలు, బేకరీ, స్వీట్ షాపులు.. ఇలా అందరిపైనా భారం పెరిగింది. చివరకు మీ ఆహార ఖర్చులపైనా ప్రభావం పడుతుంది. మొదట ఎల్‌పీజీ గ్యాస్ వంతు.. ఆ తరువాత పెట్రోల్-డీజిల్ ధరల వంతు వస్తుంది’ అని అన్నారు.

ఎన్నికలు ముగిశాక దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ‘అలర్ట్‌గా ఉండండి.. ఎన్నికల వల్ల కలిగిన ఉపశమనం ఇక ముగిసినట్టే. ఇంధన ధరలు తక్కువగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను దండుకుంది. ఇప్పుడు ధరలు పెరిగాయి కాబట్టి ధరాభారాన్ని ప్రజలపై పెడుతుంది’ అని రాహుల్ అప్పట్లో విమర్శించారు.

Updated Date - May 01 , 2026 | 04:31 PM