Share News

పిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, వాళ్లు అంతా చూశారు: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:46 PM

జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్రం మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు.

పిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, వాళ్లు అంతా చూశారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్రం మంత్రి కిరణ్ రిజిజు ప్రశంసించడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పకూడదని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

‘ఢిల్లీ పోలీసులను ప్రశంసించాలని మోదీ ప్రభుత్వంలోని మంత్రులు అంటున్నారు. పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించారు. మేకులు గుచ్చిన లాఠీలను వినియోగించారు. ఒక పిల్లాడి కన్ను పోయింది. మరో యువతి చెవి తెగి పడింది. ఇలాంటి కర్కశత్వాన్ని ప్రశంసించాలా? గాయపడ్డ పిల్లల్ని నేను వ్యక్తిగతంగా కలిశాను. నిరసనల నాటి వేల కొద్దీ వీడియోలను దేశం చూసింది’ అని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం అసత్యాలు, హింసపై ఆధారపడుతోందని ఆరోపించారు. మొదట హింసను ప్రయోగించి ఆపై అలాంటిదేమీ లేదని చెప్పుకుంటోందని ఆరోపించారు. తమ తప్పులను అంగీకరించలేని వారితోనే దేశానికి భారీ ముప్పు పొంచి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ‘పిల్లలతో అబద్ధాలు చెప్పుపొద్దు. వాళ్లకు కళ్లు ఉన్నాయి. అన్నీ గుర్తుంటాయి’ అని అన్నారు.

నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి రిజిజు సమర్థించిన విషయం తెలిసిందే. ఎవరికీ ఎలాంటి భారీ నష్టం అంతటి భారీ జన సమూహాన్ని భద్రతా దళాలు జాగ్రత్తగా మేనేజ్ చేశాయని అన్నారు. ఇందుకు ఢిల్లీ పోలీసులు, పరిపాలన యంత్రాంగాన్ని ప్రశంసించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరసనల సందర్భంగా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

విద్యార్థుల నిరసనల్లో ఏకే-47తో కాల్పులు.. జిల్లా ఎస్పీ బదిలీ

యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!

Updated Date - Aug 18 , 2026 | 09:27 PM