Share News

మోదీ కళ్లలో భయం!

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:22 AM

ప్రధాని మోదీ అమెరికాకు పూర్తి లొంగిపోయారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత-అమెరికా వర్తక ఒప్పందం ద్వారా 140 కోట్ల భారతీయ ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని విమర్శించారు.

మోదీ కళ్లలో భయం!

  • అమెరికాకు ప్రధాని మోదీ పూర్తిగా లొంగిపోయారు

  • డాటా, ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారు

  • అమెరికా ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరై భరతమాతను అమ్మేశారు: రాహుల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి):- ప్రధాని మోదీ అమెరికాకు పూర్తి లొంగిపోయారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత-అమెరికా వర్తక ఒప్పందం ద్వారా 140 కోట్ల భారతీయ ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని విమర్శించారు. డాటా, ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాల విషయంలో అమెరికాకు మోదీ సర్కారు దాసోహమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో ఉన్న అంశాలకు మోదీ భయపడుతున్నారని అన్నారు. భరతమాతను అమెరికాకు అమ్మేశారు. ఇందుకు సిగ్గు అనిపించడం లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అమెరికాకు లొంగిపోవడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా?’ అని నిలదీశారు. బుధవారం లోక్‌సభలో అధికారపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరాల నడుమ, స్పీకర్‌ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్‌ అడ్డంకుల మధ్య రాహుల్‌ ప్రసంగిస్తూ ప్రధానిపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్న వారిపై అమెరికాలో కేసు ఉందని, వారిని కాపాడేందుకే ఆ దేశానికి మోదీ లొంగిపోయారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సాధారణ పరిస్థితుల్లో దేశాన్ని మోదీ అమ్మబోరని తనకు తెలుసునని, అయితే వారు ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, అందుకే ఆయన దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. ప్రత్యర్థి గొంతు పట్టుకుంటే బాధితుడి కళ్లలో భయం ఎలా ఉంటుందో మార్షల్‌ ఆర్ట్స్‌ తెలిసిన వ్యక్తిగా తనకు తెలుసునని.. తనకు ప్రధాని కళ్లలో ఆ భయం కనబడుతోందని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల అత్యంత ముఖ్యమైన డాటా అమెరికాకు ఉచితంగా వెళుతోందని, సోర్స్‌ కోడ్‌ను వెల్లడించరని, వారికి 20 ఏళ్ల ట్యాక్స్‌ హాలిడే అందుకే ఇచ్చారని ఆరోపించారు. వ్యవసాయ యాంత్రీకరణతో చక్కగా సాగు పనులు చేసుకుంటున్న రైతులు, అమెరికా వ్యవసాయ విధానం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన టెక్స్‌టైల్స్‌ తుడిచిపెట్టుకుపోయాయని, జీరో శాతం టారిఫ్‌ ఉన్న బంగ్లాదేశ్‌ మన వస్త్ర పరిశ్రమను కుప్పకూలుస్తోందన్నారు. మన ఇంధన భద్రతను కూడా అమెరికాకు తాకట్టుపెట్టారని, మనం ఏ ఇతర దేశం నుంచీ చమురును కొనుగోలు చేయలేమని చెప్పారు. ఏ భారతీయ ప్రధానీ ఇలా చేయరని, అందులో ఎలాంటి హేతుబద్ధతా లేదని చెప్పారు. అమెరికా తన డాలర్‌ను కాపాడుకోవాలనుకుంటోందని, అందు కు మనం సహకరిస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ పేరు ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో ఉందని, ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. అనిల్‌ అంబానీని ఎప్‌స్టిన్‌కు కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పరిచయం చేశారని ఆరోపించారు. ఆదానీపై ఉన్న కేసులకు సంబంధించి అమెరికాలో సమన్లు జారీ అయ్యాయని గత 18 నెలలుగా భారత ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు.


రాహుల్‌పై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతాం: రిజిజు

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రాహుల్‌ తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిపై తపడు ఆరోపణలు చేశారని విమర్శించారు. మరోవైపు, తనకు ఎప్‌స్టిన్‌ కార్యకలాపాల్లో ఎలాంటి ఆసక్తి లేదని, 30 లక్షల ఈమెయిల్స్‌లో తన పేరు 3, 4 సార్లు మాత్రమే ప్రస్తావించారని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పేర్కొన్నారు. తనను ఎప్‌స్టిన్‌ రెండు నాలుకల ధోరణి గల వ్యక్తిగా అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు. తాను భారత ప్రభుత్వంలో చేరకముందు అమెరికాలో ఒక స్వతంత్ర శాంతి కమిషన్‌లో ఉన్నప్పుడు లింక్డ్‌ ఇన్‌ వ్యవస్థాపకుడైన రీడ్‌ హాఫ్‌మన్‌ను భారత్‌కు ఆహ్వానించానని, ఆ సందర్భంగా ఎప్‌స్టిన్‌ను ఒక ప్రతినిధి వర్గంలో భాగంగా కలుసుకున్నానని చెప్పారు. ఆయన నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 06:55 AM