Share News

ప్రియాంక క్షమాపణలు చెప్పాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:10 AM

కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత ప్రియాంకపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి...

ప్రియాంక క్షమాపణలు చెప్పాలి

  • నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను బహిష్కరించాలి

  • లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర మంత్రి జోషి ఫిర్యాదు

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత ప్రియాంకపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి అప్పగించడంపై కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక, రాహుల్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌ జోషి ఇటీవల రేపిస్టులను వెనకేసుకొచ్చారని, అలాంటి వ్యక్తికి ప్రధాని మోదీ విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్‌సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జోషి స్పందిస్తూ.. ప్రియాంక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, ఆమె ఆరోపణలను తిరస్కరిస్తున్నానని చెప్పారు. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని, తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయన స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి, ప్రియాంకపై ఫిర్యాదు చేశారు. ప్రియాంక కూడా తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు తెలియజేసినట్లు సమాచారం. కాగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి సంబంధించి తాను అన్నీ నిజాలే చెప్పానని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో అన్‌పార్లమెంటరీ పదాలేవీ లేవని, దీనిపై పాలకపక్షం ఏమైనా చేసుకోవచ్చునని అన్నారు. ఇకపైనా నిజాలే మాట్లాడతానన్నారు. ‘‘మంగళూరు పబ్‌లో బాలికలపై దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిని ప్రహ్లాద్‌ జోషి బీజేపీలో చేర్చుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తిని తొలగించినప్పటికీ ఆయనను పార్టీలో చేర్చుకున్నారనడానికి ఫొటోలు, వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నాయి. అవి నా దగ్గర ఉన్నాయి. ఇదొక మామూలు ఘటన కాదు. మహిళలపై ఆయన వైఖరికి నిదర్శనం’’ అని ప్రియాంక చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:10 AM