Share News

బస్తర్‌లో అభివృద్ధికి కొత్త శకం

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:28 AM

మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల బస్తర్‌ ప్రాంతంలో భయ వాతావరణం, అవిశ్వాసం...

బస్తర్‌లో అభివృద్ధికి కొత్త శకం

  • మావోయిస్టులపై ప్రభుత్వ చర్యలతో భయం, అవిశ్వాసం తొలగిపోయాయి

  • ‘బస్తర్‌ పండుమ్‌’లో రాష్ట్రపతి ముర్ము

జగదల్‌పూర్‌ (ఛత్తీ్‌సగఢ్‌), ఫిబ్రవరి 7: మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల బస్తర్‌ ప్రాంతంలో భయ వాతావరణం, అవిశ్వాసం తొలగిపోయాయని, అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ జిల్లా జగదల్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగే ‘బస్తర్‌ పండుమ్‌’ వేడుకలను రాష్ట్రపతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. హింసను వీడి, ప్రధాన స్రవంతిలో కలిసిన వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాలని, అదేవిధంగా శాంతి మార్గంలో పయనించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలకు లోనుకావొద్దని సూచించారు. ‘బస్తర్‌ సహజ అందాలు, అద్భుతమైన సాంస్కృతిక సంపద ప్రజలను ఎల్లప్పుడూ ఆకర్షించాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రాంతం దశాబ్దాల పాటు మావోయిజం ముప్పు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది’ అని పేర్కొన్నారు. నక్సలిజం యువత, గిరిజనులు, దళితులకు తీవ్ర నష్టం చేకూర్చిందన్నారు. మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు ఇప్పుడు హింసను వీడుతున్నారని, శాంతి మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని పేర్కొంటూ.. ‘నియాద్‌ నెల్లనార్‌’ అనే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. గ్రామాల్లో విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు ఏళ్లుగా మూడపడిన పాఠశాలలు తెరుచుకుంటున్నాయని చెబుతూ.. ‘ఇది చాలా సంతోషకరమైన దృశ్యం’ అని పేర్కొన్నారు. ఒడిశాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన తాను రాష్ట్రపతిగా మీ ముందు మాట్లాడుతున్నానని, ఇదే భారత ప్రజాస్వామ్య బలమని పేర్కొన్నారు.

ఈ వార్తలూ చదవండి:

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 06:28 AM