బెళగావి హిండలగా జైలుకు ప్రజ్వల్ రేవణ్ణ
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:24 AM
అశ్లీల వీడియోలు, అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెళగావి హిండలగా జైలుకు శుక్రవారం తరలించారు
బెంగళూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అశ్లీల వీడియోలు, అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెళగావి హిండలగా జైలుకు శుక్రవారం తరలించారు. జైళ్లశాఖ డీజీపీ అలోక్‌కుమార్ ఆదేశాల మేరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ఆయనను బెళగావికి తరలించారు. ఇటీవల పరప్పన జైలులో సీసీబీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంలో ప్రజ్వల్ బ్యారక్‌లో స్మార్ట్‌ఫోన్, చార్జర్, ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్ లభించాయి. జైలు నుంచి ప్రజ్వల్ బయటి వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ప్రజ్వల్ బ్యారక్‌లో ఉన్న విచారణ ఖైదీ ప్రతాప్ రైని విచారించగా మొబైల్, చార్జర్, సిమ్‌కార్డులు ప్రజ్వల్‌కు ఇవ్వాలని జైలులో ఒక వ్యక్తి తనకు ఇవ్వడంతో అందజేశానని చెప్పినట్టు తెలిసింది. జైలు నుంచి తన తల్లిదండ్రులు, స్నేహితులతో ప్రజ్వల్ నిత్యం మాట్లాడుతున్నట్లు బయటపడింది. దీంతో పరప్పన జైలునుంచి ప్రజ్వల్ సహా 9మంది ఖైదీలను వివిధ ప్రాంతాల జైళ్లకు మార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్