టీం ఇండియాలా పని చేద్దాం
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:43 AM
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తాలూకు ప్రకంపనలను, సవాళ్లను ‘టీం ఇండియా’లా సమష్టిగా పని చేసి అధిగమిద్దామని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
యుద్ధం వేళ అప్రమత్తంగా ఉండాలి
స్థిర వాణిజ్యం, పటిష్ఠంగా సరఫరాల వ్యవస్థ, ప్రజా అవసరాలే ప్రాధాన్యాలు
బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపాదం
ఎరువుల నిల్వ, పంపిణీకి చర్యలు
సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు
యుద్ధం ప్రభావంపై వర్చువల్‌గా సమీక్ష
న్యూఢిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తాలూకు ప్రకంపనలను, సవాళ్లను ‘టీం ఇండియా’లా సమష్టిగా పని చేసి అధిగమిద్దామని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో దైనందిన జీవనానికి, వాణిజ్యానికి, సరఫరాలకు ఏర్పడిన ఆటంకాలను ఈ విధంగానే విజయవంతంగా అధిగమించామని, ఈసారి కూడా అదే రకంగా ముందుకెళ్దామన్నారు. నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దేశ ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. శుక్రవారం మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలను మినహాయించి), కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధం రోజురోజుకీ మలుపు తిరుగుతోందని, దీనికి అనుగుణంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. ఆర్థిక వాణిజ్య రంగాలు స్థిరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవటం, ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థను పటిష్ఠపర్చటం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యాలని చెప్పారు. వేగంగా స్పందించి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా.. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య నిరంతర సంప్రదింపులు, సమన్వయం అవసరమని ప్రధాని పేర్కొన్నారు.
కంట్రోల్ రూంలతో నిరంతర పర్యవేక్షణ
ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరాలు కొనసాగేలా చూడాలని మోదీ నిర్దేశించారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు, అక్రమంగా ధరలు పెంచి విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. తప్పుడు సమాచారం, వదంతుల మీద కన్నేసి ఉంచాలని, ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుండాలని ప్రధాని చెప్పారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నౌకాయానం, నిత్యావసరాల సరఫరాలు, తీరప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన సవాళ్ల విషయం లో సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అధిక సంఖ్యలో భారతీయులున్న రాష్ట్రాలు.. వారితో సమన్వయానికి వీలుగా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసుకోవాలని, నోడల్ అధికారులను నియమించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవటానికి జిల్లా స్థాయిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లను మోదీ నిర్దేశించారు. ఈ సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి కారణంగా ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం సీఎంలు పాల్గొనలేదు. కాగా, పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించటానికి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఓ అనధికార మంత్రుల బృందాన్ని (ఇన్‌ఫార్మల్ మినిస్టర్స్ గ్రూప్‌ను) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని తెలిపాయి.