ఏఐతో జోరు.. ఎల్‌నినోపై పోరు
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:47 AM
పాలనలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని.. సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి కొత్తగా తలెత్తుతున్న...
నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రాలకు మోదీ దిశానిర్దేశం
హాజరైన 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ, జూన్ 11: పాలనలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని.. సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి కొత్తగా తలెత్తుతున్న సామాజిక సమస్యలను అధిగమించేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అలాగే ఎల్‌నినో పరిస్థితులవల్ల కలిగే ప్రమాదాలను హెచ్చరిస్తూ.. మరింత పటిష్ఠమైన నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అస్థిరత, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ వృద్ధి గాథ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉందని పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలకమండలి సమావేశం జరిగింది. దీనికి 28 రాష్ట్రాల సీఎంలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని.. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ ఉత్తమ విధానాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశానికి 28 రాష్ట్రాల సీఎంలు హాజరుకావడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.
రైతు సంక్షేమానికి అన్ని విధాలా కృషి
దేశ ఆహార భద్రత, పోషణ, సంపదకు రైతులే మూలస్తంభాలని, వారి జీవితాలను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘12 ఏళ్ల కిసాన్ సమృద్ధి’ పేరుతో ఎక్స్‌లో ఆయన పోస్టులు చేశారు.