17న ట్రంప్‌తో మోదీ భేటీ
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:36 AM
ప్రధాని మోదీ ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఫ్రాన్స్‌లోని ఏవియన్ నగరం ఇందుకు వేదిక కానుంది.
ఫ్రాన్స్‌లోని ఏవియన్ నగరంలో సమావేశం
వారం రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ, జూన్ 13: ప్రధాని మోదీ ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఫ్రాన్స్‌లోని ఏవియన్ నగరం ఇందుకు వేదిక కానుంది. ఆ నగరంలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు రానున్నారు. ఆ సందర్భంగానే ఈ భేటీ జరగనుంది. 16 నెలల విరామం అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖీగా సమావేశం కానుండడం గమనార్హం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఫ్రాన్స్, స్లొవాకియా దేశాల్లో వారం రోజుల పాటు పర్యటించే నిమిత్తం మోదీ శనివారం బయలుదేరి వెళ్లారు. శనివారం రాత్రి ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆహ్వానం మేరకు జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన ఆదివారం నైస్ నగరంలో మేక్రాన్‌తో చర్చలు జరపనున్నారు. మోదీ ఆది, సోమవారాల్లో స్లొవాకియా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశం 1993లో స్వాతంత్య్రం సంపాదించిన తరువాత భారత ప్రధాని పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఫ్రాన్స్‌లోని ఏవియన్ నగరంలో 16, 17 తేదీల్లో జరిగే జీ-7 సదస్సులో పాల్గొంటారు.