భారత్‌లో అద్భుతాలు
ABN , Publish Date - May 17 , 2026 | 04:56 AM
భారత్‌లో గతంలో ఎన్నడూ చూడనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని, భారత్ ఆకాంక్షలు ఇక ఎంతమాత్రం దేశ సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధాని మోదీ చెప్పారు.
గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి
నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని మోదీ
ది హేగ్, మే 16: భారత్‌లో గతంలో ఎన్నడూ చూడనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని, భారత్ ఆకాంక్షలు ఇక ఎంతమాత్రం దేశ సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధాని మోదీ చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆ దేశంలో ఉన్న ప్రవాస భారతీయులు శనివారం హేగ్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ సభలో మోదీ ప్రసంగించారు. ‘21వ శతాబ్దపు అవకాశాల గని భారత్. టెక్నాలజీపరంగానూ, మానవవనరుల పరంగానూ దేశం ముందడుగు వేస్తోంది’ అని పేర్కొన్నారు. భారత యువత ఆకాంక్షల కారణంగానే స్టార్ట్‌పల రంగంలో ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్నామన్నారు. ఒలింపిక్స్ నిర్వహించాలని, ప్రపంచ తయారీరంగం కేంద్రంగా మారాలని, గ్రీన్‌ఎనర్జీ రంగానికి నాయకత్వం వహించాలని, ప్రపంచ అభివృద్ధి ఇంజిన్‌గా రూపొందాలని భారత్ భావిస్తోందని మోదీ చెప్పారు. కరోనా, అంతర్జాతీయ సంక్షోభాలు, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను మోదీ ప్రస్తావిస్తూ.. ఇది సవాళ్లతో కూడుకున్న దశాబ్దమన్నారు. ‘ప్రస్తుత పరిస్థితులు త్వరగా మారకపోతే.. గడిచిన దశాబ్దాల్లో సాధించిన విజయాలన్నీ మాయమవుతాయి. ప్రపంచ జనాభాలో మెజారిటీ ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారిపోతారు’ అని హెచ్చరించారు.
చోళుల రాగి శాసనం తిరిగి భారత్‌కు
చోళుల కాలం నాటి రాగి శాసనాన్ని నెదర్లాండ్స్ శనివారం భారత్‌కు తిరిగి ఇచ్చింది. ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి వీటిని అందజేసింది. 21 రాగి రేకులు ఉన్న ఈ శాసనం బరువు సుమారు 30 కిలోల వరకు ఉంటుంది. నాగపట్టిణంలోని బౌద్ధ ఆరామానికి రాజరాజ చోళ-1 చేసిన దానాన్ని తొలుత తాళపత్రాలపై రాయగా అనంతరం ఆయన కుమారుడు రాజేంద్ర చోళ-1 ఈ రాగి రేకులపై తమిళం, సంస్కృతం భాషల్లో చెక్కించారు. నాగపట్టిణం డచ్ వారి పాలనలో ఉన్నప్పుడు 1700 ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారకుడు ఫ్లొరింటస్ క్యాంపర్ వీటిని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు.