పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:21 AM
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, సహజవాయు మౌలిక వసతులపై దాడులు జరగటం, స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.
ఇరాన్ అధ్యక్షుడితో భారత ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి21: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, సహజవాయు మౌలిక వసతులపై దాడులు జరగటం, స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో మోదీ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆయనకు రంజాన్ పండగతోపాటు ఇరాన్ నూతన సంవత్సరం నవ్‌రోజ్ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధంలో భాగంగా చమురు, సహజవాయు క్షేత్రాలు, రిఫైనరీలు, ఇతర మౌలిక వసతులపై దాడులు చేయటాన్ని మోదీ ఖండించారు. ఈ ప్రాంతంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో స్వేచ్ఛాయుగ నౌకా రవాణా అత్యంత కీలకమని పెజెష్కియాన్‌కు చెప్పినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇరాన్‌లోని భారతీయులకు ఇబ్బందులు లేకుండా కాపాడుతున్నందుకు పెజెష్కియాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమనే విధానానికి భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. గత నెల 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకోవటం ఇది రెండోసారి. ఈ నెల 12న మోదీకి పెజెష్కియాన్ ఫోన్ చేసి యుద్ధ పరిస్థితిని వివరించారు.