ఏఐపై కఠిన నియంత్రణ ఉండాలి
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:18 AM
నానాటికీ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న కృత్రిమ మేధ దుర్వినియోగానికి గురవుతుండడంపైన.. డీప్‌ఫేక్ వీడియోలపైన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగకుండా...
ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నానాటికీ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న కృత్రిమ మేధ దుర్వినియోగానికి గురవుతుండడంపైన.. డీప్‌ఫేక్ వీడియోలపైన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగకుండా ఉండడానికి భారత్ కఠిన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఏఐ సాయంతో సృష్టించిన కంటెంట్‌కు అది కృత్రిమమేధతో తయారైందన్న విషయం తెలిసేలా వాటర్ మార్కింగ్ వేసేలా నిబంధనలు విధించడం, డేటా రక్షణను మరింత మెరుగుపరచడం, విలువలతో కూడిన, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ‘ఇండియా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్’ను స్థాపించడం వంటి చర్యలన్నీ అందులో భాగమేనని మోదీ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ నేపథ్యంలో ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని కృత్రిమ మేధకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞాన అంతిమ లక్ష్యం, సాంకేతిక పురోగమనం మానవాళి సేవకేగానీ, దాన్ని పక్కకు తప్పించడానికి కాదని.. అందుకే ఈ సదస్సుకు ‘సర్వజన హితాయ-సర్వజన సుఖాయ’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
వికసిత భారత్ లక్ష్యం దిశగా మా పయనం వేగం పుంజుకోవడంలో కృత్రిమ మేధ ఒక పరిణామశీల అవకాశానికి ప్రతీక. ఏఐతో పలు పెను సవాళ్ల పరిష్కారం సులభం కాగలదు. ఇది సరికొత్త ఆర్థిక అవకాశాలను పూర్తిస్థాయిలో సృష్టించగలదు. కృత్రిమ మేధతో అంతరాలు పెరుగుతాయని ప్రపంచం ఆందోళన చెందుతోందిగానీ.. భారత్ మాత్రం అంతరాలను రూపుమాపడానికి ‘ఏఐ’ని వాడుతోంది.
సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సరిగ్గా చేర్చడం, మోసాలను గుర్తించడం, మౌలిక సదుపాయాల ముందస్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతను పెంపొందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది.
భారతదేశ ఐటీ రంగం మన సేవల ఎగుమతులకు వెన్నెముకగా ఉండటమే కాకుండా ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. ఈ రంగానికి ఏఐ అద్భుతమైన అవకాశాలను అందించడంతోపాటు.. సవాళ్లనూ సంధిస్తోంది. అయితే, ఐటీ రంగాన్ని ఏఐ భర్తీ చేయడం లేదు.. దాన్ని రూపాంతరం చెందేలా చేస్తోంది.
ఏఐ మానవ సామర్థ్యాలను మెరుగుపరచొచ్చు. కానీ నిర్ణయాధికారానికి సంబంధించిన తుది బాధ్యత మాత్రం మానవుల దగ్గరే ఉండాలి. డీప్‌ఫేక్ వీడియోల తయారీ, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఏఐను వాడడంపై కఠినమైన నిషేధాలు ఉండాలి.
ఉద్యోగ మార్కెట్లో ఏఐ ప్రభావం గురించి మన యువత ఆందోళనను నేను అర్థం చేసుకున్నాను. భయానికి ఉత్తమ విరుగుడు సన్నద్ధతే. అందుకే ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మన ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విరివిగా పెట్టుబడులు పెడుతున్నాం.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ