సెలవుల్లో.. విదేశీ విహారాలొద్దు!.. ప్రధాని పిలుపు
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:33 AM
భారత ఆర్థిక వ్యవస్థ అనుకున్నదానికంటే వేగంగా దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, సంక్షోభ పరిస్థితుల్లోనూ ఏప్రిల్-మే-జూన్ త్రైమాసికంలో...
ఇతర దేశాల్లో పెళ్లిళ్లు మానండి.. కిర్గిస్థాన్ నుంచి ప్రధాని పిలుపు
స్వదేశంలోనే పెళ్లి వేడుకలు చేసుకోండి
అనవసరంగా బంగారం కొనవద్దు
సంక్షోభంలోనూ 7.8 % వృద్ధి రేటు: మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: భారత ఆర్థిక వ్యవస్థ అనుకున్నదానికంటే వేగంగా దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, సంక్షోభ పరిస్థితుల్లోనూ ఏప్రిల్-మే-జూన్ త్రైమాసికంలో మన దేశ జీడీపీలో 7.8 % వృద్ధి రేటు నమోదైందన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని మంగళవారం కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన వీడియో సందేశంలో తెలిపారు. ఇదే సమయంలో మరోసారి పొదుపు మంత్రం పఠించారు. సెలవుల్లో విదేశీ విహారాలు మానాలని.. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం ఆపాలని కోరారు. భారత్‌లోనే వివాహ వేడుకలు జరుపుకోవాలని పిలుపిచ్చారు. అలాగే అనవసరంగా బంగారం కొనవద్దని కూడా సూచించారు. ‘ప్రపంచమంతా యుద్ధంలో మునిగిపోయింది. సంక్షోభాలు ఈ విశ్వాన్ని చుట్టుముట్టాయి. 2020లో కొవిడ్ కాలం నుంచి నేటికీ స్థిరత్వం లేదు. అయినప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోంది’ అని వివరించారు. ఆర్థిక వ్యవస్థ ఓవైపు విస్తరిస్తుంటే దేశంలో కొందరు వ్యక్తులు.. అసత్యాలను, వ్యతిరేకతలను ప్రచారం చేస్తున్నారని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. మన వృద్ధి వేగాన్ని కొనసాగించాలన్నారు. ‘ఇందుకోసం ఆత్మనిర్భరత, స్వదేశీ, స్వావలంబన అవసరం. స్వదేశీ, స్వావలంబన.. 2047నాటికి భారతదేశం అగ్ర రాజ్యంగా ఆవిర్భవించాలన్న లక్ష్యానికి పునాది’ అని మోదీ స్పష్టంచేశారు. ప్రతి అంశంలో వ్యతిరేకతలను వెతికే నిరాశావాదుల కథనాలను జీడీపీ వృద్ధి రేటు బదాబదలు చేసిందన్నారు. ‘నా ప్రభుత్వ విధానాలు మంచివి.. దాని ఉద్దేశాలు సుస్పష్టం. అందుకే అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకుంటోంది’ అని అన్నారు. అయితే.. ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కొట్టిపారేశారు. ఇది ప్రచార ఆర్భాటమని, ప్రధాని అబద్ధాల సమర్థతకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. ‘‘ఇదొక లైట్స్, కెమెరా.. ఇదీ.. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రధాని మోదీ పీఆర్ కథ’’ అని ఖర్గే విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..