మీకు రీల్స్ తెలుసా!?
ABN , Publish Date - May 23 , 2026 | 04:25 AM
మీలో రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యకలాపాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్‌లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి మీరు చెప్పుకున్నారా....
మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు?
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా!?
యువత ఎలా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా!?
జెన్‌జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు
పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్లే..
యువతను తృప్తి పరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి
వారి ఆలోచనలకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి
లేకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది
కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్
ఈసారి క్యాబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట
జేడీయూ, టీడీపీలకూ అదనపు శాఖలు!
న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘మీలో రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యకలాపాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్‌లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి మీరు చెప్పుకున్నారా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది ఉన్నారు? దేశంలో యువత ఏవిధంగా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా!?’’... ఇవి ఎవరు ఎవరితో అన్న మాటలో తెలుసా!? కేంద్ర మంత్రులను సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నలివి!! దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే! ప్రధాన పార్టీల సభ్యత్వాలను దాటేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పార్టీకి మద్దతుదారులు గంటగంటకూ పెరిగిపోతున్నారు. ఇది దేశంలోని యువత మనోభావాలను ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయం ప్రబలుతోంది. మరోవైపు, తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన విజయ్.. స్వల్ప కాలంలోనే ఘన విజయం సాధించడమే కాదు.. ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే, గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో జెన్‌జీ, యువత ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జెన్‌జీ తరం పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా లేదని, బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించి పార్టీకి పట్టం కట్టింది వారేనని మోదీ చెప్పినట్లు సమాచారం. ‘‘మనం ఏం చేస్తున్నామో చెప్పేందుకు మనమే యువతరం వద్దకు వెళ్లాలి. మనం సరైన పనులు చేస్తున్నామని వారు గ్రహించేలా చేయాలి.
ప్రస్తుతం దేశంలో 18-30 వయసు మధ్య ఉన్న యువతరం మనకు ముఖ్యం. వారిని సంతృప్తి పరిచేందుకు ఏమి చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి’’ అని మోదీ వారికి ఉద్బోధించినట్లు తెలిసింది. యువత ఆలోచనా విధానానికి తగ్గట్లుగా మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని, లేకపోతే వారినే మార్చాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ‘‘నేటి తరం యువత పేపర్లు చదవడం లేదు. టీవీలు చూడడం లేదు. అనునిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. వారిని ఆకర్షించేందుకు సర్వ యత్నాలూ చేయాలి’’ అని నిర్దేశించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని, ముఖ్యంగా యువతను చేరుకోవాలని నిర్దేశించారు.
మంత్రివర్గంలో భారీ మార్పులు
ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ మూడ్‌ను బట్టి చూస్తుంటే.. మంత్రివర్గంలో భారీ మార్పులు తథ్యమని తేలిందని ఆ పార్టీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పనితీరు ఆధారంగా ఉద్వాసనలు, శాఖల మార్పులు, పదోన్నతులు ఉండవచ్చని ప్రధాని పరోక్షంగా సూచించినట్లు తెలిపారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై మోదీ దృష్టి కేంద్రీకృతమైందని, అందువల్ల మంత్రివర్గంలో మార్పుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లకు ప్రాధాన్యం ఉండవచ్చని తెలుస్తోంది. యువత గురించి మోదీ మాట్లాడిన మాటలను బట్టి పలువురు సీనియర్లను ఇంటికి పంపి.. మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని ఓ నేత అంచనా వేశారు. సమీక్షలో ప్రధాని ప్రధానంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, పౌర విమానయానం, షిప్పింగ్, మౌలిక సదుపాయాలపై మాట్లాడారని, అందువల్ల ఈ శాఖల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చని మరొక నేత అభిప్రాయపడ్డారు. ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలకు అదనపు శాఖలు లభించవచ్చని కూడా చర్చ జరుగుతోంది. నెలాఖరులో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ టీమ్‌ను ప్రకటించడానికీ, మంత్రివర్గంలో మార్పులకు సంబంధం ఉందని, పలువురు మంత్రులకు పార్టీ బాఽధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. కాగా సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ సమావేశం కాగానే హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. ఈనెల 25న అమిత్ షాను కలుసుకునేందుకు ఆయన మళ్లీ ఢిల్లీ వస్తున్నట్లు తెలిసింది.