Share News

ఇప్పుడే కాదు.. ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా భారత్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:14 AM

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య బంధం రక్తం, త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌, యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో...

ఇప్పుడే కాదు.. ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా భారత్‌

  • రక్తం, త్యాగంతో ఏర్పడిన బంధం మనది

  • ఇజ్రాయెల్‌ గడ్డపై 4 వేల మంది భారత సైనికులు ప్రాణాలర్పించారు

  • మన రెండు దేశాలూ ఉగ్రవాద బాధితులే

  • ఇజ్రాయెల్‌ పార్లమెంటు నెస్సెట్‌లో మోదీ

జెరూసలేం, ఫిబ్రవరి 25: భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య బంధం రక్తం, త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌, యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1918, సెప్టెంబర్‌లో ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని హైఫా వద్ద స్థానికులను కాపాడేందుకు శత్రువులతో పోరాడుతూ 4 వేల మందికిపైగా భారత సైనికులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ రెండు దేశాలు ఉగ్రవాద బాధితులేనని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని పునరుద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ నెస్సెట్‌లో ప్రసంగించారు. నెస్సెట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోదీయే. ‘ఈ భూమితో భారత బంధం రక్తం, త్యాగాలతో ముడిపడి ఉంది. ఇక్కడ(నెస్సెట్‌) నిలబడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఒక గొప్ప నాగరికతకు చెందిన ప్రతినిధి.. మరో గొప్ప నాగరికతను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు’ అని మోదీ అన్నారు.

మేమూ ఉగ్రవాద బాధితులమే

ఇజ్రాయెల్‌పై 2023, అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిని మోదీ ఖండించారు. ‘అక్టోబర్‌ 7దాడిలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి భారతీయుల సంతాపాలను మోసుకొని నేనిక్కడికి వచ్చాను. మీ బాధ మాకు తెలుసు. మీ దుఃఖాన్ని మేము అర్థం చేసుకోగలం. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారత్‌ స్థిరంగా నిలబడుతుంది. సామాన్య పౌరులను చంపటాన్ని ఏవిధంగానూ సమర్థించుకోలేరు. సుదీర్ఘకాలంగా భారత్‌ కూడా ఉగ్రవాద బాధితురాలే. ముంబైలో 26/11 ఉగ్ర దాడుల్లో భారతీయులతోపాటు ఇజ్రాయెలీలు కూడా మరణించారు. మీలాగే మేము కూడా ఉగ్రవాదంపై కఠిన వైఖరితో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించేది లేదు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతికి ఉగ్రవాదంతో ముప్పే. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాల మధ్య సమన్వయం అవసరం. అందుకే గాజా శాంతి ప్రణాళికకు భారత్‌ మద్దతిస్తోంది. ఈ ప్రణాళిక ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ న్యాయం, శాంతి అందిస్తుందని భారత్‌ బలంగా నమ్ముతోంది’ అని మోదీ తెలిపారు.

2.jpg


రక్షణ సహకారం ఎంతో ముఖ్యం

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకు సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో నమ్మకమైన మిత్ర దేశాలైన భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య రక్షణ రహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యమని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారమే అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను ‘స్టార్టప్‌ దేశం’ అని సంబోధించిన మోదీ.. భారత యువత కూడా ఆవిష్కరణల్లో దూసుకుపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మోదీ సోదర సమానుడు: నెతన్యాహు

భారత ప్రధాని మోదీ తనకు స్నేహితుడికంటే ఎక్కువ అని, సోదర సమానుడని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. మోదీ కంటే ముందు నెస్సెట్‌లో ప్రసంగించిన ఆయన.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలో గొప్ప నేతల్లో ఒకరు, నా ప్రియమైన మిత్రుడు నరేంద్రమోదీకి జెరూసలేం స్వాగతం పలుకుతోంది. నరేంద్ర (ఏకవచనం) నాకు మిత్రుడు, సోదరుడు. ఇజ్రాయెల్‌- భారత్‌ సంబంధాలను బలోపేతం చేయటంలో మోదీయే చాంపియన్‌. ఆయన ఇజ్రాయెల్‌కు గొప్ప స్నేహితుడు. మోదీ ఆలింగనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఇజ్రాయెల్‌ కూడా శక్తిమంతమైనదే. ఇస్లామిక్‌ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మన రెండు దేశాలు కలిసి ఉక్కు బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. కాగా, మోదీ ప్రసంగానికి ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్‌ ఐసాక్‌ అమిత్‌ను ఆహ్వానించకపోవటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నెస్సెట్‌ నుంచి వాకౌట్‌ చేశారు.

Updated Date - Feb 26 , 2026 | 02:14 AM