Share News

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ABN , Publish Date - May 20 , 2026 | 02:45 AM

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు మంగళవారం ప్రకటించాయి...

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

  • ఐదు రోజుల్లోనే రెండోసారి..

  • లీటరు పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసల పెంపు

  • హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.111.88

  • డీజిల్‌ ధర రూ.99.89కు చేరిక

  • పెంపు మన దేశంలోనే తక్కువ: బీజేపీ

న్యూఢిల్లీ, మే 19: దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు మంగళవారం ప్రకటించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్‌ రేట్లు పెంచబోమన్న ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా ఐదు రోజుల్లోనే రెండోసారి ధరలను పెంచడం గమనార్హం. ఈ నెల 15వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచగా, తాజాగా మరో 90పైసల వరకు పెంచారు. దీనితో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.111.88కి డీజిల్‌ ధర రూ.99.89కి చేరాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల్లో స్థానిక పన్నుల ఆధారంగా, వేర్వేరు కంపెనీల బంకుల్లో రవాణా వ్యయం ఆధారంగా ఈ పెంపులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ రూ.98.64, డీజిల్‌ రూ.91.58కి చేరాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచక తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని పెట్రోలియం కంపెనీలు పేర్కొన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌లపై లీటర్‌కు రూ.10 చొప్పున పెంచవచ్చనే అంచనాలూ వెలువడ్డాయి. అయితే ఒక్కసారిగా పెంచితే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో దశలవారీగా పెంచాలని పెట్రోలియం కంపెనీలు సిద్ధమైనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సీఎన్జీ ధర కూడా కిలోకు 15వ తేదీన రెండు రూపాయలు, 17వ తేదీన ఒక రూపాయి కలిపి రూ.3 పెరిగింది. ఇలా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ ధరలు పెరగడంతో రవాణా వ్యయం పెరిగి.. దాదాపు అన్నిరకాల వస్తుసేవల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా పశ్చిమాసియా సంక్షోభం అనంతరం ప్రపంచంలో గల్ఫ్‌ దేశాలు మినహా భారత్‌లో మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు అతి తక్కువ అని బీజేపీ పేర్కొంది. చాలా దేశాల్లో 20శాతం నుంచి 50శాతానికిపైగా పెట్రోలియం ధరలు పెరిగితే.. భారత్‌లో ఈ పెంపు కేవలం 4శాతమేనని బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు రోజుకు రూ.1,000 కోట్లు నష్టాలను భరిస్తూ వస్తున్నాయని, ప్రజలపై భారం వేయలేదని తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 02:45 AM