Share News

మళ్లీ భారీగా పెట్రో బాదుడు!

ABN , Publish Date - May 26 , 2026 | 04:21 AM

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈసారి చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున బాదేశాయి.

మళ్లీ భారీగా పెట్రో బాదుడు!

  • లీటరు పెట్రోల్‌పై రూ.2.61

  • డీజిల్‌పై రూ.2.71 పెంపు

  • 2 వారాల్లోపే నాలుగోసారి పెంచిన వైనం

  • మొత్తంగా లీటరుకు రూ.7.50 పెరుగుదల

  • అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన రోజే దేశంలో భారీగా పెంపు!

  • ధరలు పెంచే మనిషి మళ్లీ బాదారు: రాహుల్‌

  • సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ సర్కారు పెట్రోల్‌ చల్లుతోంది: ఖర్గే

న్యూఢిల్లీ, మే 25: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈసారి చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున బాదేశాయి. రెండు వారాల్లోపే నాలుగోసారి ధరలు పెంచాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదిరిందని, 60 రోజులు హోర్ముజ్‌ను తెరుస్తారన్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధర దాదాపు 5 శాతం పడిపోయింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర సోమవారం ఒక దశలో 95.41 డాలర్లకు తగ్గగా.. దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రో ధరలను భారీగా పెంచడం గమనార్హం. తాజా పెంపుతో పెట్రో ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రెండున్నరేళ్ల పాటు దేశంలో పెట్రో ధరలను పెంచలేదు. చివరిసారిగా 2024లో సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రో ధరలు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. కాగా, ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు ధరలు పెంచారు. తాజా పెంపుతో పెట్రో ధరలు మొత్తంగా లీటరుపై రూ.7.50 పెరిగినట్లయింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.102.12కు, డీజిల్‌ రూ.95.20కు.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.115.58, డీజిల్‌ రూ.103.74కు చేరాయి. అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి క్రూడాయిల్‌ ధరలు 50 శాతంపైగా పెరిగాయని.. అయినా ఆ భారం ప్రజలపై వేయలేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం ముప్పును తప్పించేందుకు కేంద్ర ఆదేశాల మేరకే ధరలు పెంచలేదని అంటున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా చమురు ధర కేవలం 5 శాతమే తగ్గిందని చెబుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసేవరకు ఆగి, ఇప్పుడు భారీగా ధరలు పెంచేస్తోందని ఆరోపిస్తున్నాయి.


ధరలు పెంచే మనిషి మళ్లీ బాదేశారు!: రాహుల్‌

మళ్లీ పెట్రో ధరలు పెంచిన నేపథ్యంలో ప్రధాని మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ధరలు పెంచే మనిషి’ మళ్లీ బాదేశారంటూ సోమవారం ఘాటు విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఒకటే పని. అదేంటంటే ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం. ఇతర సమయాల్లో జనాల జేబులు గుల్ల చేయడం’’ అని రాహుల్‌ ఆరోపించారు. దేశంలో ఆర్థిక తుఫాను వస్తుందని కొన్ని నెలల నుంచే తాను హెచ్చరిస్తున్నానని.. మోదీ మాత్రం ఎన్నికల హడావుడిలో, అవి ముగిసిన తర్వాత పెట్రో ధరలు పెంచడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.

ఈ దోపిడీతో లాభపడుతున్నదెవరు?: ఖర్గే

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్‌ చల్లుతోందని విమర్శించారు. 2014లో రూ.71.41 ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధరను మోదీ సర్కారు 2026 నాటికి రూ.102.12కు చేర్చిందని ఎద్దేవా చేశారు. రెండు వారాల్లోపే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నాలుగోసారి పెంచారని.. ఈ రోజువారీ ఇంధన దోపిడీ ఇంకా ముగిసిపోలేదని చెప్పారు. 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇంధనంపై రూ.43 లక్షల కోట్లు దోచుకుందని దుయ్యబట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నాలుగోసారి పెరగడంతో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ షేర్లు వరసగా 5.8, 4.4, 3.9 శాతం పెరిగాయని.. ప్రజల కంటే కంపెనీల లాభాలకే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నైజమని విమర్శించారు.


ఈవీ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ పెంపు!

  • యోచనలో కేంద్రం.. ప్రతిపాదనలు రూపొందిస్తున్న భారీ పరిశ్రమల శాఖ

దేశంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై ఇస్తున్న సబ్సిడీలను మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా ప్రతిష్ఠాత్మక పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల సబ్సిడీల కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు నిధులను కోరాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉందని.. అయితే నిధుల మొత్తం ఎంతనేది ఇంకా నిర్ణయించలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘గత 2 నెలలుగా దీనిపై చర్చ జరుగుతోంది’ అని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 2024లో పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని ప్రారంభించినప్పుడు 24.7 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను సబ్సిడీ కింద ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ నెల 24 నాటికే 23.5 లక్షల వాహనాలను సబ్సిడీ కింద అందజేసినట్లు సమాచారం. ఇక గత ఆర్థిక సంవత్సరం చివరివరకు పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల సబ్సిడీ కోసం రూ.10,900 కోట్లు కేటాయించగా.. వాటిని ఈ జూలై చివరి వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ మేరకు ఈ పథకానికి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే బడ్జెట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ నెల మొదటి అర్ధభాగంలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే 13.5శాతం పెరిగాయి.

Updated Date - May 26 , 2026 | 04:21 AM