సీఈసీపై విచారణకు ఆదేశించండి
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:47 AM
దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో చట్టబద్ధ విధులను విస్మరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది.
ఆయన చట్టబద్ధ విధుల్ని ఉల్లంఘించారు
ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం
లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు
ఆ నిర్ణయాలను, సాఫ్ట్‌వేర్ మార్పులను
చెల్లనివిగా ప్రకటించాలి
ఫారం-6లో మార్పులను రద్దు చేయాలి
సుప్రీంలో అడ్వొకేట్ శైలేంద్ర పిటిషన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో చట్టబద్ధ విధులను విస్మరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద అడ్వొకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి శుక్రవారం ఈ పిటిషన్‌ను వేశారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుం డా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రారంభించిన, ఆమోదించిన, అమలు చేసిన అన్ని నిర్ణయాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా, చెల్లనివిగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరారు. ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, ఫారం-6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటా నిర్వహణ తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి 14 సందర్భాలలో అభ్యంతరాలను నమోదు చేసిన అంశం తాజాగా బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
అధికారిక విధులను ఉల్లంఘించారు..
ఓటర్ల జాబితాల తయారీ, సవరణ లేదా దిద్దుబాటుకు సంబంధించి అధికారిక విధులను ఉల్లంఘిస్తే శిక్షను ఖరారు చేసే 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 ఆధారంగా చర్యలు చేపట్టాలని శైలేంద్ర మణి సుప్రీంకోర్టును కోరారు. సీఈసీ, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీశ్‌గార్గ్, డైరెక్ట ర్ జనరల్(ఐటీ) సీమా ఖన్నా సహా బాధ్యులైన ఇత ర అధికారులపై విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధం గా ఫారం-6ను మార్చడం, ఓటర్ల జాబితా డేటాను కేంద్రీకరించడం, ఈసీఐనెట్ వ్యవస్థ ద్వారా అర్హులైన ఓటర్లకు న్యాయం చేయడంలో విఫలమవడం వంటి తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారన్నారు.
13 కోట్ల పేర్ల తొలగింపుపై విచారణ జరపాలి
ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్ డేటాబే్‌సలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల పేర్లు తొలగించడంపై దర్యాప్తు చేయాలని శైలేంద్ర మణి సుప్రీంకోర్టును కోరారు. ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ, ఐటీ నిపుణుల సహాయంతో, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ లేదా ప్రత్యేక దర్యా ప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈసీ పేరిట ఏకంగా 16.10 లక్షల అప్పీళ్లను కోర్టుల్లో అనధికారికంగా దాఖలు చేయడంలో వ్యక్తిగత బాధ్యత ఎవరిదో తేల్చాలని కోరారు. పిటిషన్‌లో కేంద్రప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, కేబినెట్ కార్యదర్శి, మనీశ్ గార్గ్, సీమా ఖన్నాలను ప్రతివాదులుగా చేర్చారు.
జ్ఞానేశ్‌కుమార్ కార్యక్రమాలు వాయిదా!
ఎన్నికల సంఘం వ్యవహారాలపై తీవ్ర కలకలం రేగుతున్న సమయంలో.. యూపీ, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ నేతృత్వంలో జరగాల్సిన కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఈసీ నిర్వహిస్తున్న ‘ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఓటరు అవగాహన)’ కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్లతో జ్ఞానేశ్ ముఖాముఖి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్ర కటించారు. ప్రస్తుతం ఈసీలో వివాదానికి, వాయిదాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళ మార్ఫింగ్ ఫొటోలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం