ఖేరాకు సుప్రీంలో మళ్లీ నిరాశే
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:51 AM
కాంగ్రెస్ నేత పవన్‌ఖేరాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి ఈ నెల 20 వరకూ రక్షణ కల్పించాలన్న ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవటానికి కోర్టు...
20వ తేదీ వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న విజ్ఞప్తికి నిరాకరణ
బెయిల్ కోసం అస్సాం కోర్టుల్లోనే ప్రయత్నించాలని పునరుద్ఘాటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కాంగ్రెస్ నేత పవన్‌ఖేరాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి ఈ నెల 20 వరకూ రక్షణ కల్పించాలన్న ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవటానికి కోర్టు శుక్రవారం నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు తనకు మంజూరు చేసిన ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ గడువు శుక్రవారంతో ముగుస్తుందని, అస్సాంలో కోర్టులు శని, ఆదివారాల్లో సెలవులో ఉంటాయి కాబట్టి సోమవారం అక్కడ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తానని, అప్పటి వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఖేరా కోరారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ‘అస్సాం సీఎంకు ఇబ్బంది కలిగించిన కారణంగా వంద మంది పోలీసులు ఢిల్లీలోని ఖేరా ఇంటిని చుట్టుముట్టారు. ఆయనేమైనా ఉగ్రవాదా? దేశపౌరులకు రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ ఆయనకు వర్తించదా?’ అని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవటానికి నిరాకరించింది. వీలైనంత త్వరగా అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సదరు కోర్టు సెలవులో ఉన్నా పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా చట్టప్రకారం విజ్ఞప్తి చేయాలని పేర్కొంది. అస్సాం సీఎం హిమంత భార్యకు భుయాన్‌కు పలు దేశాల పాస్‌పోర్టులతోపాటు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని పవన్‌ఖేరా ఈ మధ్య ఆరోపించారు. ఇవి తప్పుడు ఆరోపణలని పేర్కొంటూ రిణికి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ఖేరాపై అస్సాంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఖేరాను అరెస్టు చేయకుండా వారంపాటు తెలంగాణ హైకోర్టు ఆయనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. దీనిని అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు బెయిల్‌పై స్టే విధించింది. ముందస్తు బెయిల్ కోసం అస్సాం కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. తాజాగా, మరోసారి ఖేరా విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, అస్సాంపోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..