పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:42 AM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం పార్లమెంట్ ఉభయ సభలు రెండూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం పార్లమెంట్ ఉభయ సభలు రెండూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే స్పీకర్ ఓం బిర్లా సమావేశాల ముగింపు ప్రసంగాన్ని చదివారు. అనంతరం ఆయన సభను నిరవధికంగా వాయిదా వేశారు. ‘వందేమాతరం’ గీతాలాపనతో సమావేశాలు ముగిశాయి. సభలో తొలిసారిగా జాతీయ గీతంలోని ఆరు చరణాలూ ఆలాపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ దాదాపు 151 గంటల 42 నిమిషాల పాటు సమావేశమైనట్టు స్పీకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 93 శాతంగా ఉందన్నారు. మరోవైపు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. సభ్యుల సహకారంతో సభ ఉత్పాదకత 110 శాతంగా ఉన్నట్టు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఎగువ సభ 157 గంటల 40 నిమిషాల పాటు సమావేశమైనట్టు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నిర్వహించిన సమావేశాల్లో భాగంగా డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ను ఎన్నుకున్నారు. పార్లమెంట్ ఉభయ సభల నిరవధిక వాయిదా తర్వాత రాధాకృష్ణన్ తన కార్యాలయంలో పలువురు ఎంపీలతో భేటీ అయ్యారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా, విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నితిన్ నబీన్, దిగ్విజయ్ సింగ్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ, రంజీత్ రంజన్, నసీర్ హుస్సేన్ తదితర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్