Share News

జైళ్లపై ‘రిమాండ్‌’ ఒత్తిడి!

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:17 AM

మనదేశంలోని 300కి పైగా జైళ్లలో సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఉన్నారని ఇండియా జస్టిస్‌ అనే సంస్థ వెల్లడించింది. వీరిలో అత్యధికంగా రిమాండ్‌ ఖైదీలే ఉన్నారని...

జైళ్లపై ‘రిమాండ్‌’ ఒత్తిడి!

  • నేరం నిరూపణ కాకుండానే సగటున మూడేళ్ల వరకు జైల్లోనే

  • 300కిపైగా జైళ్లలో సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: మనదేశంలోని 300కి పైగా జైళ్లలో సామర్థ్యం కంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఉన్నారని ఇండియా జస్టిస్‌ అనే సంస్థ వెల్లడించింది. వీరిలో అత్యధికంగా రిమాండ్‌ ఖైదీలే ఉన్నారని తెలిపింది. దీనివల్ల నిద్రించే స్థలం దగ్గరనుంచి ఆరోగ్య వసతులు, పర్యవేక్షణ వరకు, పలు మౌలిక సమస్యలతో జైళ్లు కునారిల్లుతున్నాయని నివేదించింది. కోర్టు తీర్పుల్లో జాప్యం కారణంగా అండర్‌ట్రయల్‌ (రిమాండ్‌) ఖైదీలతో జైళ్లు నిండిపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఈ మేరకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైస్సెన్‌ (టీఐఎ్‌సఎ్‌స)తో కలిసి సేకరించిన గణాంకాలను గత వారం ఈ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికను అనుసరించి, ఢిల్లీ సెంట్రల్‌ జైలు నం.4లో 2023 నాటికి సామర్థ్యం కంటే 550ు కంటే అధికంగా ఖైదీలున్నారు. బిహార్‌లోని దీనాపూర్‌ సబ్‌ జైలు, జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా జైలులో 300ు, పశ్చిమబెంగాల్‌లోని కందీ సబ్‌జైలులో 450ు కంటే ఎక్కువగా ఖైదీలు ఉన్నారు. కోర్టుల్లో శిక్షలు పడే కేసులు పెరగడం వల్ల జైళ్లపై ఒత్తిడి పెరుగుతున్నదా అంటే, అలాంటిదేమీ లేదు. పైగా తీర్పుల్లో విపరీత జాప్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. దీనివల్ల మనదేశంలోని జైళ్లలోని ఖైదీల్లో 76ు రిమాండ్‌ ఖైదీలే ఉన్నారు. అంటే, ఇంకా నేరం నిరూపణ కాని నిందితులన్నమాట. గత రెండు నుంచి ఐదేళ్ల కాలంలో వీరి సంఖ్య రెట్టింపునకు చేరుకుంది. 2023 లెక్కల ప్రకారం, ప్రతి నలుగురికి ఒక రిమాండ్‌ ఖైదీ సగటున ఏడాదినుంచి మూడేళ్ల వరకు జైలులో ఉంటున్నారు.


797 మందికి ఒక వైద్యుడు

జైళ్లలో సరిపడా సిబ్బంది లేరు. ఖైదీల అవసరాలు తీర్చగల స్థాయిలో వసతులు లేవు. దేశవ్యాప్తంగా జైళ్లలో 30 శాతం గార్డింగ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 రాష్ట్రాల పరిధిలోని జైళ్లలో ఒక్క మానసిక వైద్య నిపుణుడు కూడా లేరు. దాదాపు 1,150 మంది మానసిక వైద్యులను నియమించాలని మోడల్‌ ప్రిజన్‌ మాన్యువల్‌ నిర్దేశించగా, ఇప్పటివరకు 65 పోస్టులు మంజూరుచేసి, వాటిలో 35 పోస్టులను మాత్రమే నింపారు. ప్రస్తుతం 797 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 06:17 AM