మోదీపై విపక్షాల ఉమ్మడి పోరు
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:53 AM
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సీజేపీ, ఇండియా కూటమి తమ పోరాటాలను మరింత తీవ్రతరం, కేంద్రీకృతం చేస్తున్నాయి.

సీఈసీ ఎపిసోడ్‌తో ఏకమైన ప్రతిపక్షాలు
గాంధీ జయంతి సందర్భంగాదేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం
నేటి నుంచి సీజేపీ ఆందోళనలు
6 నుంచి ఇండీ కూటమి పోరాటాలు
ఓట్ల చోరీతోనే బీజేపీ అధికారంలోకి
వస్తోందని భారీ ప్రచారం
వచ్చే ఏడాది కీలక అసెంబ్లీ ఎన్నికలు
ఉండటంతో తీవ్ర ఒత్తిడిలో బీజేపీ!
న్యూఢిల్లీ, అక్టోబరు 1: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సీజేపీ, ఇండియా కూటమి తమ పోరాటాలను మరింత తీవ్రతరం, కేంద్రీకృతం చేస్తున్నాయి. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి సీజేపీ దేశవ్యాప్త ఉద్యమం మొదలుపెడుతోంది. తొలుత ముంబైలోని శివాజీ పార్కు వేదికగా శుక్రవారం బలప్రదర్శనకు సిద్ధమైంది. సీఈసీ తన పదవికి రాజీనామా చేసే వరకు వెనక్కు తగ్గబోమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేస్పష్టంచేశారు. ముంబై ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌లో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.
అప్పటికీ సీఈసీ రాజీనామా చేయకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలపారు. కాగా, శివాజీ పార్కులో నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించాలని సీజేపీ నిర్ణయించింది. ఇండియా కూటమి కూడా ఈ నెల ఆరోతేదీ నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే సొంతం గా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కూటమి వెలుపల ఉన్న పార్టీలు కూడా సొంతంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
నేడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ప్రకటించింది. ఎస్‌ఐఆర్, ఫామ్-6లో మార్పులపై ఈసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ ఏజెంటులా మారి ఎన్నికల ప్రక్రియలను ప్రభావితం చేశారని, అందువల్లే లోక్‌సభతోపాటు ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. సీఈసీని నడిపిస్తున్నది ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయేనని ఆరోపిస్తున్నాయి. ఇంకో అడుగు ముందుకేసి మోదీయే పీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, గురువారం ముంబై మెరెన్ డ్రైవ్ వద్ద పోలీసులకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఆయన మద్దతు దారులు ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకు ఆ తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టారు.
ఆత్మరక్షణలో బీజేపీ..
ఎస్‌ఐఆర్ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ఇప్పటివరకు బీజేపీ తడబడుతూనే ఉంది. ఈసీలోని ముగ్గురు కమిషనర్లలో భిన్నాభిప్రాయాలు సహజమని, అది ప్రజాస్వామ్యానికి మూలసూత్రమని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టాల్సిన అత్యవసరం బీజేపీకి ఏర్పడింది. 2027 ఫిబ్రవరి-మార్చిలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది నవంబరులో హిమాచల్‌ప్రదేశ్, డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2028లో ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు నమ్మితే తమకు కష్టాలు తప్పవని బీజేపీ భయపడుతోంది. దీంతో విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రియుడి భార్య సూచనలతోనే.
lప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్