‘ఒక దేశం-ఒక ఎన్నిక’.. ఓ కుట్ర
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:55 AM
సర్ ప్రక్రియ విషయంలో ఎన్నికల సంఘం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నినాదం అయిన ‘ఒక దేశం- ఒక ఎన్నిక’.. అనేది ఓ కుట్ర అని విమర్శించారు.
ఆ నినాదం వెనుక బీజేపీ ఉద్దేశాలు వేరే..
‘ఒక దేశం-ఒక పార్టీ’ అనేదే అసలు లక్ష్యం
కాక్రోచ్ నేత అభిజీత్ దీప్కే ధ్వజం
కార్యకర్తలకు పోలీసుల నోటీసులపై ఆగ్రహం
ముంబై, అక్టోబరు 6 : సర్ ప్రక్రియ విషయంలో ఎన్నికల సంఘం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నినాదం అయిన ‘ఒక దేశం- ఒక ఎన్నిక’.. అనేది ఓ కుట్ర అని విమర్శించారు. ‘ఒక దేశం- ఒక రాజకీయ పార్టీ’ అనే ఎజెండా దీని వెనుక ఉన్నదని విమర్శించారు. మంగళవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సిటీలో దీప్కే మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగ(సవరణ) బిల్లు-2024ను, దానికి జతగా కేంద్ర పాలిత ప్రాంతాల(సవరణ) బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ బిల్లులు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబై కేంద్రంగా ఆందోళనలు చేసిన కాక్రోచ్ నేతలు, కార్యకర్తలకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. దీనిపై దీప్కే స్పందిస్తూ.. తాము ఈ నెల 10వ తేదీన ఢిల్లీ జంతర్‌మంతర్‌లో తలపెట్టిన భారీ ధర్నాకు ఆటంకాలు కల్పించడంలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల చర్యను ‘నియంతృత్వ పోకడ’గా దుయ్యబట్టారు. ఢిల్లీకి వెళ్లవద్దు అని, ప్రయాణానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయంటూ తమ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన