575 ఏళ్లకు సరిపోయే కరెంటు.. ఒక్క ఏడాదిలో ఉత్పత్తి!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:28 AM
రోజురోజుకీ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నాం. అయినా, ఎప్పటికప్పుడు కరెంటు డిమాండ్ పెరుగుతోంది.
సముద్రాల శక్తిని ఉపయోగించుకుంటే సాధ్యమే: ఇన్కాయిస్
పలు దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతిలో కరెంటు
‘బ్లూ ఎనర్జీ’పై భారత్ కసరత్తు.. అండమాన్‌లో పైలట్ ప్రాజెక్టు
2-3 ఏళ్లలో సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి
వెల్లడించిన ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్
హైదరాబాద్ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకీ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీనికోసం బొగ్గు, నీరు, గాలి, సౌరశక్తి, అణుశక్తి వంటి అన్ని వనరులనూ ఉపయోగిస్తున్నాం. అయినా, ఎప్పటికప్పుడు కరెంటు డిమాండ్ పెరుగుతోంది. దీనికి పరిష్కారం ఏమిటి? సముద్రాలే అని చెబుతున్నారు నిపుణులు. సముద్రాలు అపారమైన శక్తి నిలయాలు. ఆ శక్తిని ఒడిసిపట్టుకుంటే విద్యుత్ కొరతన్నదే ఉండదని అంటున్నారు. మన దేశానికి అందుబాటులో ఉన్న సముద్ర జలాల నుంచి ఒక సంవత్సరంలో 9.2 లక్షల టెరావాట్ల (ఒక టెరావాట్ 10 లక్షల మెగావాట్లకు సమానం) విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్’ (ఇన్కాయిస్) లెక్కగట్టింది. ఇది ఎంత కరెంటు అంటే.. 575 సంవత్సరాల పాటు యావత్ దేశానికి విద్యుత్ కోతలనేవే లేకుండా నిరంతరాయంగా కరెంటును అందించవచ్చు. మరి ఈ విద్యుత్‌ను ఒడిసిపట్టడం సాధ్యమేనా?!

పలు దేశాల్లో ఇప్పటికే ముందడుగు
ఇప్పటికే జపాన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో నదీ జలాలు, సముద్ర జలాలతో కలిసే చోట విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సముద్రాల ఉప్పునీటికి, నదుల స్వచ్ఛమైన నీటికి మధ్య లవణీయత (సాలినిటీ)లో ఉండే తేడాను ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని బ్లూఎనర్జీ లేదా ఆస్మాటిక్ పవర్ అని పిలుస్తున్నారు. దక్షిణ కొరియాలో సముద్ర అలలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అత్యంత భారీ టైడల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించారు. పోర్చుగల్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా కూడా ఈ తరహా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. మహాసముద్రాలలో ఉన్న అపారమైన శక్తి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ‘ఇండియా బ్లూ ఎనర్జీ’ కార్యక్రమాలకు బీజం పడింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ వెల్లడించారు. వాటి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో సముద్రంలో ఆటుపోట్లు, ప్రవాహాలు, అలలు, కెరటాలు వంటి వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వీటికే పరిమితం కాకుండా సముద్ర జలాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా, నదులు-సముద్ర జలాల మధ్య ఉన్న సాలినిటీ (లవణీయత) తేడాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. దీంట్లోభాగంగా ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్‌ను ఇన్కాయిస్ రూపొందించింది. దీని ప్రకారమే మన సముద్ర జలాల్లో సంవత్సరానికి 9.2 లక్షల టెరావాట్ల కరెంటును ఉత్పత్తి చేయవచ్చు. మరోవైపు, ఈ దిశగా ప్రైవేటు రంగంలోనూ ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఓ అంకుర సంస్థ (స్టార్టప్) సముద్ర అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయటంలో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ సంస్థ తమ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. లక్షద్వీప్‌లో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ’.. సముద్ర జలాల పైపొరలు, లోపలి పొరల్లో ఉండే వ్యత్యాసాన్ని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. సముద్రపు ఆటుపోట్ల ద్వారా కరెంటు ఉత్పత్తికి గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అనుకూలమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదీ సంగమ ప్రాంతాలలో సాలినిటీ గ్రేడియెంట్ ఆధారంగా కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నట్లు తెలిసింది.
ప్రస్తుతానికి వ్యయం ఎక్కువే
ఇప్పటికే తాము అండమాన్‌లోని హిందూ మహాసముద్రంలో హాట్‌స్పాట్స్ గుర్తించామని, ఎనర్జీ కన్వర్టర్లు, హైబ్రిడ్ కన్వర్టర్లు, సముద్రంలో ఓ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కసరత్తు జరుపుతున్నామని బాలకృష్ణన్ నాయర్ తెలిపారు. 2-3 ఏళ్లలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందన్నారు. కాగా, సముద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వ్యయం ప్రస్తుతానికి ఎక్కువగానే ఉంటోంది. ఒక మెగావాట్ టైడల్ విద్యుత్‌కు గరిష్ఠంగా దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదే సౌర విద్యుత్‌కు రూ.3-4 కోట్లు, పవన విద్యుత్‌కు రూ.4-5 కోట్లు సరిపోతుంది.
ఏపీలో తీరప్రాంతాలకు ముప్పు
ఇన్కాయిస్ విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరిలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కోస్టల్ మల్టీ హజార్డ్ జోన్ (సీఎంజెడ్) పరిధిలో ఉన్నాయి. సముద్రపు కోత కారణంగా ఈ జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. సీఎంజెడ్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో మరో 25 ఏళ్లు, 50 ఏళ్లు, మొత్తంగా ఈ శతాబ్దం ఆఖరుకు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? పెరుగుతున్న సముద్ర మట్టానికి అనుగుణంగా జరిగే నష్టం ఎంత? తదితర అంశాలపై ‘ఓషన్ క్లైమెట్ సర్వీసె్‌స’లో భాగంగా ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందిస్తామని ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ వెల్లడించారు.