Share News

‘ఎన్‌టీఏ’ భద్రత పటిష్ఠం

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:49 AM

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-2026 ప్రశ్న పత్రం లీకైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర అలజడిరేపిన నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) భద్రతా చర్యలను పటిష్ఠం చేసే దిశగా...

‘ఎన్‌టీఏ’ భద్రత పటిష్ఠం

  • అన్ని కార్యాలయాల వద్ద 24/7 నిరంతర భద్రత

  • రూ.7.5 కోట్లతో టెండర్లు.. 17 వరకు బిడ్లకు అవకాశం

  • నీట్‌ పేపర్‌ లీక్‌తో చర్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-2026 ప్రశ్న పత్రం లీకైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర అలజడిరేపిన నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) భద్రతా చర్యలను పటిష్ఠం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి అనుబంధ ఆఫీసుల వరకు నిరంతర భద్రతను కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికిగాను రూ.7.5 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. మింటో రోడ్‌లోని ఎన్‌టీఏ కేంద్ర కార్యాలయం, ఓఖ్లాలోని ప్రాంతీయ కార్యాలయం సహా స్టోరోజీ సౌకర్య కేంద్రాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో నిరంతర(24/7) భద్రత కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఎన్‌టీఏలో పనిచేసే ఉద్యోగులు, కార్యాలయాలకు వచ్చేవారు, ఆస్తులు, కార్యాలయ ప్రాంతాలు, రికార్డులు, గోప్యతా పరమైన పరీక్ష మెటీరియల్‌, సర్వర్‌ రూములు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, అత్యంత కీలకమైన మౌలిక సదుపాలు ఉన్న ప్రాంతాల్లో భద్రత కల్పించాల్సి ఉంటుంది. టెండరు దక్కించుకున్న సంస్థ.. ఎలాంటి మార్పులు లేకుండా రెండేళ్లపాటు భద్రత కల్పించాలి. దీనికిగాను ఎన్‌టీఏ జీఎ్‌సటీ(తాత్కాలిక)తో కలిపి రూ.7.5 కోట్లను కేటాయించింది. బిడ్లు సమర్పించేందుకు ఈ నెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. టెండరు ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుంది. టెండరు దక్కించుకున్న సంస్థ సేవలు సంతృప్తికరంగా ఉంటే రెండేళ్ల తర్వాత ఏడాది చొప్పున రెండు సార్లు పొడిగించనున్నారు. టెండరు దాఖలు చేసే సంస్థలు రూ.15 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10 కోట్లకు చొప్పున వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 06:49 AM