Share News

ఈ ఇన్సులిన్‌.. వారానికి ఒక్కసారే!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:44 AM

ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు.. మధుమేహ బాధితుల పాలిట నరకం! వైద్యుడి సిఫారసును బట్టి కొందరు ఈ ఇంజెక్షన్లను పూటపూటా తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరికి రోజుకు ఒకసారిలేదా రెండుసార్లు...

ఈ ఇన్సులిన్‌.. వారానికి ఒక్కసారే!

కొత్త ఇంజెక్షన్‌ ‘అవిక్లీ’ని భారత్‌లో విడుదల చేసిన నోవోనార్డిస్క్‌

  • 700 యూనిట్ల ప్యాక్‌ ధర రూ.2611

న్యూఢిల్లీ, జూలై 9: ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు.. మధుమేహ బాధితుల పాలిట నరకం! వైద్యుడి సిఫారసును బట్టి కొందరు ఈ ఇంజెక్షన్లను పూటపూటా తీసుకోవాల్సి వస్తుంది. మరికొందరికి రోజుకు ఒకసారిలేదా రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది!! ఇలా రోజూ కాకుండా వారానికి ఒకసారి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ చేసుకునే అవకాశం ఉంటే? ప్రముఖ ఫార్మాదిగ్గజం నోవోనార్డిస్క్‌ అలాంటి ఇంజెక్షన్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు అవిక్లి. దీన్నే ‘ఇన్సులిన్‌ అయోడెక్‌’గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వీక్లీ బేసల్‌ ఇన్సులిన్‌’. సాధారణంగా మనం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా మన కాలేయం కొంత గ్లూకోజ్‌ను శరీరంలోకి విడుదల చేస్తుంటుంది. అలా ఖాళీ సమయాల్లో రక్తంలో చక్కెరస్థాయులు పెరిగిపోకుండా ఇచ్చే ఇన్సులిన్‌ను ‘బేసల్‌ ఇన్సులిన్‌’ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నవన్నీ 24 నుంచి 42 గంటలపాటు మాత్రమే పనిచేసే ఇంజెక్షన్లు. అందుకే వాటిని రోజుకొకసారైనా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా.. ఒకసారి ఇంజెక్ట్‌ చేసుకుంటే ఏకంగా వారంపాటు పనిచేసే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ను నోవోనార్డిస్క్‌ అభివృద్ధి చేసిం ది. టైప్‌-1, టైప్‌-2 డయాబెటిస్‌ బాధితులు వైద్యుల సిఫారసుతో దీన్ని వాడొచ్చు. భారత్‌లో చాలా మంది మధుమేహ బాధితులు.. ఖర్చుకు, నొప్పికి భయపడి ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల వాడకాన్ని 7నుంచి 9 ఏళ్లు వాయిదా వేస్తున్నట్టు ఒక అంచనా. ఈ నేపథ్యంలోనే షుగర్‌ బాధితులకు ఆ రెండు సమస్యల నుంచి కొంతమేర ఉపశమనం ఇచ్చేందుకే దీన్ని అందుబాటులోకితెచ్చినట్టు నోవోనార్డిస్క్‌ సంస్థ తెలిపింది. ఇక ధర విషయానికి వస్తే.. 700 యూనిట్‌ ప్యాక్‌ అవిక్లీ ధర రూ.2611. అంటే.. ఒక్కో యూనిట్‌ ధర రూ.3.73. రోజువారీ ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల యూనిట్‌ ధరతో పోలిస్తే ఇది 30 నుంచి 40ు తక్కువని నోవోనార్డిస్క్‌ వెల్లడించింది. ఈ ప్యాక్‌ ఒక్కటి తీసుకుంటే వైద్యుల సిఫారసు మేరకు వారానికి ఎన్ని యూనిట్లు కావాలో ఆ మేరకు ఇంజెక్ట్‌ చేసుకోవచ్చు. ఎంత మందు కావాలో అంతే తీసుకునేలా దీంట్లో ఏర్పాటు ఉంటుంది. ఉదాహరణకు.. ఇన్సులిన్‌ను ప్రారంభ దశలో రోజుకు 10 యూనిట్లు సరిపోతుంది. అంటే.. వారానికి 70 యూనిట్లు. ఈ పెన్‌ వెనుక ఉండే చక్రాన్ని తిప్పుతూ 70 యూనిట్ల వద్దకు వచ్చాక ఇంజెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 06:50 AM