స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించవద్దు.. మరో లా కాలేజీ విద్యార్థుల లేఖ
ABN , Publish Date - Aug 16 , 2026 | 09:02 PM
త్వరలో జరగనున్న స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించవద్దని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్‌ఐయూ) విద్యార్థులు లేఖ రాశారు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో జరగనున్న స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించవద్దని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్‌ఐయూ) విద్యార్థులు లేఖ రాశారు. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీఐ చైర్మన్ తీరును విమర్శించారు.
ఇది దేశంలో శక్తిమంతమైన వ్యవస్థలతో విభేదించే స్వేచ్ఛకు సంబంధించిన అంశమని విద్యార్థులు పేర్కొన్నారు. తమ వృత్తి జీవితంపై భయం లేకుండా అధికారులతో విభేదించే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. నల్సార్ విద్యార్థులు స్ఫూర్తివంతమైన ధైర్యసాహనాలు, నైతిక నిబద్ధత కనబరిచారని ప్రశంసించారు. వారికి బేషరతుగా సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు.
నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించడంపై అక్కడి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్‌కు ఆహ్వానంపై అభ్యంతరం చెప్పిన వారిని న్యాయవాదులుగా చేర్చుకోవద్దంటూ రాష్ట్రాల కౌన్సిల్స్‌కు లేఖ రాసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే బీసీఐ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. నల్సార్ విద్యార్థులకు మిశ్రా క్షమాపణలు చెప్పారు. విద్యార్థుల ఆందోళనను, వారి స్వతంత్ర ఆలోచనా ధోరణిని గౌరవించాల్సిందేనని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎల్ఎస్‌ఐయూ విద్యార్థులు కూడా లేఖ రాయడం కలకలం రేపుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
పార్టీ ఆఫీస్‌లో టీఎంసీ నేత, మాజీ మంత్రి ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
హసీనాను అప్పగిస్తేనే బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటన