రాజ్యసభకు బిహార్ సీఎం నితీశ్ నామినేషన్
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:33 AM
బిహార్ సీఎం నితీశ్‌కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో నితీశ్‌తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా పట్నాలో నామినేషన్ దాఖలు చేశారు...
పట్నాలో అమిత్ షా సమక్షంలో నామినేషన్
ఈ నెల 16న ఫలితాల తర్వాత నితీశ్ రాజీనామా
మే నెలలో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ
పట్నా, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): బిహార్ సీఎం నితీశ్‌కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో నితీశ్‌తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా పట్నాలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయకముందు రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు నితీశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పుడే తనకు రాష్ట్రంలోని రెండు చట్టసభలకు అలాగే పార్లమెంట్‌లోని రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఉండేదని గుర్తు చేశారు. అందుకే తాను రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిహార్‌లో కొత్త ప్రభుత్వానికి తన మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 16న రాజ్యసభకు ఎన్నికలు జరిగి అదే రోజు ఫలితాలు వెలువడ్డాక నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. నితీశ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన అమిత్ షా మాట్లాడుతూ బిహార్‌ను జంగిల్‌రాజ్ నుంచి విముక్తి కల్పించారని ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు.
నితీశ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు?
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనే విషయంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాని కి ఆయన సారధ్యం వహిస్తున్న జేడీయూ మద్దతు కొనసాగడం కీలకం కూడా. నితీశ్ గతంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రంలో భారీ మార్పులు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మే నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కేంద్రంలో పలు పెద్ద తలకాయలను తొలగించడమే కాక ఆశ్చర్యకరమైన రీతిలో కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అనారోగ్య కారణాల వల్ల నితీశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో నితీశ్‌పై మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది. అయితే బిహార్ కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు బిహార్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
కుల సమీకరణాల ఆధారంగా బిహార్ కొత్త సీఎం ఎంపిక
బిహార్ కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ కుల సమీకరణాల ఆధారంగా వడపోత ప్రారంభించింది. నితీశ్ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న సమ్రాట్ చౌదరి రేసులో ముందున్నారు. ఆయన వెనుకబడిన కుశ్వాహ వర్గానికి చెందినవారు. యాదవ్ సామాజికవర్గానికి చెందిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పేరును కూడా సీరియ్‌సగా పరిశీలిస్తున్నారు. బిహార్ మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉంది. రాష్ట్ర మంత్రి దిలీప్ జైస్వాల్, బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.