Share News

జూన్‌ 21న మళ్లీ నీట్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:07 AM

ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన వైద్య విద్య ప్రవేశపరీక్ష నీట్‌-యూజీని మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ....

జూన్‌ 21న మళ్లీ నీట్‌

  • రీఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ ఖరారు

  • 14వ తేదీ నాటికి అడ్మిట్‌ కార్డులు

  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ/చెన్నై, మే 15: ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన వైద్య విద్య ప్రవేశపరీక్ష నీట్‌-యూజీని మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్‌ ఖరారు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జూన్‌ 21న రీఎగ్జామినేషన్‌ ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ ఆధారిత సీబీటీ విధానం) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నీట్‌ యూజీ పరీక్షకు సంబంధించి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ టయన తెలిపారు. పరీక్షను తిరిగి నిర్వహించడంపై గురువారం సాయంత్రం ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో ఉన్నత స్థాయు సమావేశం జరిగింది. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ కొత్త తేదీని శుక్రవారం ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రీఎగ్జామినేషన్‌లో అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్‌ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5.15 గంటల వరకు ఆఫ్‌లైన్‌ (పేపర్‌ పెన్సిల్‌) విధానంలో పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను మరోసారి ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. జూన్‌ 14వ తేదీ నాటికి అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తామని వివరించారు. అభ్యర్థులకు వారి పరీక్షా ఫీజును పూర్తిగా రీఫండ్‌ చేస్తామని, వచ్చే నెల జరిగే రీటెస్టును ఉచితంగా నిర్వహిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలుత ఈ నెల 3న నీట్‌ నిర్వహించిన విష యం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది.


మరోసారి అలా జరగబోదు..

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని, నీట్‌-యూజీ నిర్వహణలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధరేంద్ర ప్రధాన్‌ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి భయం లేకుండా విద్యార్థులంతా తిరిగి పరీక్ష రాయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అభ్యర్థులకు అండగా ఉంటుందని, ఈసారి అక్రమాలు జరగనివ్వబోమని పేర్కొన్నారు. ఏ మాఫియా గానీ, ధన బలం కానీ మీ సీటును లాక్కోకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నామన్నారు. ‘గెస్‌ పేపర్ల’ వ్యవహారం ఎన్టీఏ గ్రీవెన్స్‌ సిస్టమ్‌కు వచ్చిన అభ్యంతరాల తర్వాత వెలుగులోకి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఆ వెంటనే ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. నాలుగైదు రోజుల తర్వాత అక్రమాల వ్యవహారంపై ఒక స్పష్టత వచ్చిందని, గెస్‌ పేపర్ల పేరుతో ప్రశ్నపత్రం లీజ్‌ అయిందనే నిర్ధారణకు వచ్చి, ఆ వెంటనే విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా మే 3 నాటి పరీక్షను రద్దు చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎన్టీఏలోని వారైనా, బయటి వారైనా.. ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని ప్రధాన్‌ స్పష్టం చేశారు.

ఈ ఏడాది నీట్‌ మినహాయించాలి: స్టాలిన్‌

2026-27 విద్యా సంవత్సరానికి నీట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు ఎన్‌ఎంసీ చట్టం-2019లోని సెక్షన్‌ 14ను సవరించేలా ఒక ఆర్డినెన్స్‌ జారీ చేయాలన్నారు. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్య అడ్మిషన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతివ్వాలని అభ్యర్థించారు.

Updated Date - May 16 , 2026 | 04:07 AM