ఎన్‌టీఏ నుంచే లీకేజీ!
ABN , Publish Date - May 15 , 2026 | 04:18 AM
కంచె చేను మేస్తే అన్న చందంగా.. నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచే ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని సీబీఐ వెల్లడించింది.
అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా నీట్ ప్రశ్నపత్రాలు బయటకు!
న్యూఢిల్లీ, జైపూర్, పట్నా, మే 14: కంచె చేను మేస్తే అన్న చందంగా.. నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచే ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని సీబీఐ వెల్లడించింది. ఎన్‌టీఏ నుంచి బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు పుణెకు చెందిన ఓ వ్యక్తిని చేరాయని, అక్కడి నుంచి ప్రధాన నిందితుడు శుభం ఖైర్నార్ చేతికి అందాయని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులు శుభం ఖైర్నార్ (నాసిక్), మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్ (జైపూర్), యశ్ యాదవ్ (గురుగ్రాం)లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ గురువారం వాదనలు వినిపించింది. పేపర్ లీకేజీ అక్రమాలు జరిగిన తీరును సీబీఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వివరించారు. ‘మంగీలాల్ బివాల్ చిన్న కుమారుడు అమన్ నీట్ యూజీ పరీక్ష రాయనున్న నేపథ్యంలో.. ప్రశ్నపత్రాల కోసం మంగీలాల్ శుభం ఖైర్నార్‌ను సంప్రదించాడు. దీనిపై శుభం పుణెకు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తికి ఎన్‌టీఏలో పరిచయాలున్నాయి. అక్కడి నుంచి ప్రశ్నపత్రాలు రాగానే వాటిని శుభం సహ నిందితుడైన యశ్ యాదవ్‌కు పంపించాడు. ఏప్రిల్ 29వ తేదీన యశ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నపత్రాలను పీడీఎఫ్ రూపంలో టెలిగ్రాంలో మంగీలాల్‌కు పంపించాడు. దీంట్లో కనీసం 150 ప్రశ్నలు అసలు ఎంట్రెన్స్ ప్రశ్నపత్రంలో ఉన్నట్లైతే రూ.10 లక్షలు ఇవ్వటానికి మంగీలాల్ అంగీకరించాడు. పీడీఎ్‌ఫను మరిన్ని ప్రింట్లు తీసి తన కుమారుడు అమన్‌తోపాటు నీట్ రాస్తున్న బంధుమిత్రుల పిల్లలకు కూడా మంగీలాల్ అందజేశాడు. మరింత మంది నీట్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే, వారికి పేపర్‌ను అమ్ముదామని, అభ్యర్థుల వివరాలు సేకరించాలని మంగీలాల్.. వికాస్ బివాల్‌కు చెప్పాడు. దీంతో వికాస్ పలువురు నీట్ అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని లీకైన ప్రశ్నపత్రాల కోసం వారి వివరాలను యశ్‌కు పంపించాడు. ఈ విధంగా లీకేజీ పేపర్ల పంపిణీ కొనసాగింది’ అని వివరించారు. నిందితులను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని సీబీఐ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మే రకు నిందితులను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ లీకేజీ వ్యవహారం అంతా ఒక వ్యవస్థీకృత ముఠా ఆధ్వర్యంలో జరిగినట్లుందని న్యాయాధికారి వ్యాఖ్యానించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు తదితర ఉపకరణాలను సీబీఐ.. ఫోరెన్సిక్ విభాగానికి పంపించింది. డిలీట్ చేసిన సమాచారం ఏదైనా లభించవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఎన్‌టీఏ నుంచే లీకేజీ జరిగిందని తెలిసిన నేపథ్యంలో.. ఆ సంస్థలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్రపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా, నీట్ ప్రశ్నపత్రాలను ముద్రిం చే ప్రింటింగ్ ప్రెస్సు గురించి తెలిసిన అధికారుల ప్రమేయం ఉండవచ్చని భావిస్తోంది. ఈ మేరకు పలువురు అధికారులు, సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని (ధనంజయ్ లొఖాండా, మనీషా వాఘ్మరేలను) సీబీఐ గురువారం అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
యూపీలో విద్యార్థి ఆత్మహత్య
నీట్ రద్దుతో తీవ్ర ఆవేదనకు లోనైన యూపీకి చెందిన రితిక్ మిశ్రా అనే విద్యార్థి.. ఇంట్లో ఉరేసుకున్నాడు. లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన రితిక్ ఇప్పటికే రెండుసార్లు నీట్ రాశాడు. తాజాగా మరోసారి పరీక్షకు హాజరయ్యాడని, ఈసారి తప్పకుండా సీటు వస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, పరీక్ష రద్దయిందని తెలిసినప్పటినుంచీ తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యాడని రితిక్ తండ్రి అనూ్‌పమిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం ఐ ఐఎం అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరవడా నికి వచ్చిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. మళ్లీ నీట్‌ను నిర్వహించటంపై గురువారం ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
డాక్టర్ పేరుతో దందా!
లీకేజీ కేసులో కీలక నిందితుడైన శుభం ఖైర్నార్ తాను డాక్టర్‌నని చెప్పుకొనేవాడని, కానీ, అతడు ఏనాడూ మెడికల్ కాలేజీ క్లాసులకు హాజరు కాలేదని తాజాగా వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీలో ఆయుర్వేదిక్ కోర్సులో శుభం అడ్మిషన్ తీసుకున్నప్పటికీ.. తరగతులకు, పరీక్షలకు ఎన్నడూ హాజరు కాలేదని వర్సిటీ వీసీ తెలియజేయటం గమనార్హం. మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కౌన్సెలింగ్ పేరిట నాసిక్‌లో ఓ సంస్థను నెలకొల్పిన శుభం.. పేపర్ లీకేజీ రాకెట్‌లో కీలక సూత్రధారి.
లీకేజీపై అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు..
ఈ నెల 3న నీట్ జరిగిన మరుసటి రోజు రాత్రి 1:30 గంటల సమయంలో రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చి నీట్ పేపర్ లీక్ అయ్యిందని చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. తన వద్ద చేతిరాతతో ఉన్న కొన్ని పత్రాలను చూపు తూ.. గెస్ పేపర్ పేరుతో ఇవి బయటకు వచ్చాయని, నీట్‌లో ఇవే ప్రశ్నలు వచ్చాయని ఆ వ్యక్తి తెలిపారు. లిఖితపూర్వకంగా వివరాలు తెలియజేయాలని పోలీసులు పేర్కొన్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎన్‌టీఏకు ఈమెయిల్‌లో ఫిర్యాదు పంపించారు. నీట్‌లో వచ్చిన ప్రశ్నలను గెస్ పేపర్‌తో సరిపోల్చమని తనకు ఓ వ్యక్తి అందజేశాడని, రెండింటిలో ఉన్న ప్రశ్నలు ఒకటే కావటంతో.. పేపర్ లీకేజీ జరిగిందని భావించి తాను ఫిర్యాదు చేస్తున్నట్లుగా పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్‌టీఏకు ఫిర్యాదు చేసిన ఈయన సికార్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో అధ్యాపకుడిగా పని చేస్తున్నట్లు సమాచారం.
బిహార్ కేంద్రంగా మరో ముఠా
బిహార్‌లోని భగవాన్ మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల కేంద్రంగా ఓ నీట్ అక్రమాల ముఠా పని చేసినట్లు వెల్లడైంది. నీట్ జరగటానికి ఒకరోజు ముందు బిహార్‌లోని నలందాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు.. ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించటంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాల్లో నోట్ల కట్టలు కనిపించాయి. సెల్‌ఫోన్లను పరిశీలించినప్పుడు నీట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, ఆర్థిక లావాదేవీలు జరిగిన రికార్డులు కనిపించాయి. దీనిపై పోలీసులు ప్రశ్నించినప్పుడు.. నీట్ తదితర ఎంట్రెన్స్‌లకు అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను పంపించి పరీక్ష రాయించే ముఠా గురిం చి తెలిసింది. అవధేశ్ కుమార్, అమన్ కుమార్ సింగ్, పంకజ్ కుమార్ అనే ఈ ముగ్గురు నిందితుల్లో అవధేశ్ కీలక వ్యక్తి అని, మహవీర్ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి అని వెల్లడైంది. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ ముఠాపై దృష్టి పెట్టింది. ఈ మేరకు గురువారం దర్యాప్తు అధికారులు సదరు కాలేజీ హాస్టళ్లలో సోదాలు జరిపారు. నీట్ అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, నకిలీ అడ్మిట్‌కార్డులను సృష్టించి, అసలైన అభ్యర్థుల బదులు ఇతరులను పరీక్ష కేంద్రాలకు పంపించారని విచారణలో తేలింది.